Ravanasura: ‘రావణాసుర’ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది

1 Apr, 2023 09:55 IST|Sakshi

‘‘రావణాసుర’ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. సుధీర్‌ వర్మగారు సౌండింగ్‌ కొత్తగా ఉండాలనుకుంటారు. సాంగ్స్, నేపథ్య సంగీతం కొత్తగా చేశాం. ఈ సినిమాకి పని చేయడం సవాలుగా అనిపించింది’’ అని సంగీతదర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజవుతోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్, భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’కి థీమ్‌ సాంగ్‌ కావాలని అభిషేక్, సుధీర్‌ వర్మ గార్లు అడగటంతో ట్యూన్‌ ఇచ్చాను. అది విని ‘రావణాసుర’కి నువ్వే మ్యూజిక్‌ చేస్తున్నావ్‌’ అనడంతో సర్ర్‌పైజ్‌గా అనిపించింది. రవితేజగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాకి పని చేయడంతో నా కల నెరవేరింది.

‘రావణాసుర’కి నేను నాలుగు పాటలు, నేపథ్య సంగీతం అందించాను. భీమ్స్‌గారు ఓ ప్రత్యేక పాట చేశారు. సందర్భానుసారమే ఇళయరాజాగారి ‘వెయ్యిన్నొక్క జిల్లాల..’ పాటని రీమిక్స్‌ చేశాం. ‘అర్జున్‌ రెడ్డి, జార్జ్‌ రెడ్డి’ తర్వాత ‘రావణాసుర’ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం ‘డెవిల్‌’, ‘యానిమల్‌’ (హిందీ) సినిమాలకి సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు