ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

19 Feb, 2021 09:16 IST|Sakshi

మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇస్సాక్ థామస్ ఇకలేరు

పలు జాతీయ, రాష్ట్ర పురస్కారాలు

సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ కేరళ సంగీత దర్శకుడు ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా  నిన్న( గురు వారం) చెన్నైలో తుది శ్వాస విడిచారు. థామస్‌ మరణంపై కేరళ సాంస్కృతిక మంత్రి ఎకె బాలన్ సంతాపం ప్రకటించారు.సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన ఆయన జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆయన లేని లోటు తీరనిది అంటూమంత్రి ఎకె బాలన్ ఫేస్‌బుక్‌లో కుటుంబ సభ్యులను సానుభూతి తెలిపారు.  ఇంకా పలు సినీరంగ ప్రముఖులు థామస్‌ అకాలమృతిపై విచారం వ్యక్తం చేశారు.

మలయాళ ప్రముఖ దర్శకుడు కెజి జార్జ్ చిత్రం మన్ను ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన  థామస్‌ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించారు.  ముఖ్యంగా ఆడమింటే మకాన్ అబూకు ఉత్తమ నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సలీం అహ్మద్ రచించిన 2011 చిత్రం ఆడమింటే మకాన్ అబూ, ఉత్తమ నేపథ్య స్కోర్‌తో సహా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకోవడమేకాదు ఆస్కార్‌కు కూడా నామినేట్‌ అయింది.  వీటితోపాటు భావం (2002), మార్గం (2003), సంచరం అండ్‌ ఒరిడామ్ (2004) అనే నాలుగు చిత్రాలకు ఉత్తమ నేపథ్య సంగీతానికి స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు. ఇంకా కుట్టి స్రాంక్ (2009), సంచరం (2004), షాజీ ఎన్ కరుణ్ స్వాహం(1994), సతీష్ మీనన్ భావం (2002) కుంజనంతంతే కడా (2013) లాంటి  సినమాలకు సంగీతం సమ​కూర్చారు. ఇస్సాక్ థామస్ మాజీ ఎంపీ  జార్జ్ థామస్ కుమారుడు.

కాగా కేరళ కొట్టాయం జిల్లా పాలాలో జన్మించిన ఇస్సాక్ థామస్ పూణేలోని ప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ)లో చిత్ర నిర్మాణం,  స్క్రీన్ ప్లే చదివారు. అనంతరం కొడైకెనాల్‌లోని అమెరికన్ టీచర్స్ స్కూల్ నుండి సంగీత కోర్సు పూర్తి చేసిన తరువాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్‌ గ్రేడ్‌ సాధించారు.

మరిన్ని వార్తలు