Raj-Koti: మా పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు: కోటి తీవ్ర భావోద్వేగం

21 May, 2023 19:45 IST|Sakshi

రాజ్- కోటి ద్వయం టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు. వారిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతమందించారు. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ లాంటి  బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చామన్నారు. ఆదివారం రాజ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన సహచరుడు కోటి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారని ఆయన అన్నారు. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడినని కన్నీళ్లు పెట్టుకున్నారు.  తనతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయన్నారు. 

(ఇది చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. 'నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నా. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నా. మొన్న ఈ మధ్యే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం.' అని చెప్పుకొచ్చారు.

(ఇది చదవండి: నేను పుట్టాక మా అమ్మానాన్న నా ముఖం కూడా చూడలేదు: హీరోయిన్‌

వారి మధ్య బంధం గురించి మాట్లాడుతూ.. 'చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటూ ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం.  నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాను. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటాడు' అని అన్నారు.


 

మరిన్ని వార్తలు