అణువణువూ ఈ నగరం నాకు ఇష్టమైందే: కోటి

27 Aug, 2020 09:01 IST|Sakshi

టాలీవుడ్‌ అగ్రగామి సంగీత దర్శకుడు కోటి.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కమనీయ సంగీతాన్ని కనువిప్పు కలిగించే సందేశాత్మకంగా మలిచారు. మహమ్మారిపై అవగాహన పెంచారు. చిరంజీవి సహా పెద్ద స్టార్స్‌తో ఆయన స్వరపరచిన ‘నీ చేతల్లోనే కదా భవిత..’ పాట లక్షలాది మందిని ఆకట్టుకుంది. ఆ విజయం స్ఫూర్తితో మరో మూడు పాటలు రూపొందించారాయన. తాజాగా సేవ్‌ ద వరల్డ్‌ పేరుతోనూ పర్యావరణంపై అవగాహన పెంచుతూ ఓ ఆల్బమ్‌ విడుదల చేశారు. సందేశాత్మక ఆల్బమ్స్‌ విడుదల చేయడంతో పాటు ఔత్సాహిక గొంతులకు సానపెట్టే పనిలో ఉన్న ఈ సక్సెస్‌ఫుల్‌ సంగీత దర్శకుడు ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..  
   
సాక్షి, హైదరాబాద్‌: సంగీతం అంటే సంతోషాన్ని పంచేది మాత్రమే కాదు సందేశాన్ని అందించేది కూడా.. అయితే మా లాంటి సినీ సంగీత దర్శకులకు అలాంటి అవకాశం ఎప్పుడో గానీ రాదు. అయితే కరోనా వ్యాప్తి, అది సృష్టించిన భయం.. లాక్‌డౌన్‌ పరిస్థితులు నాకు ఆ అవకాశం ఇచ్చాయి. కోవిడ్‌ గురించి ప్రజల్లో భయాందోళన పెరుగుతున్న తొలినాళ్లలో నాకు తెలిసున్న శ్రీనివాస్‌మౌళి అనే యంగ్‌ రైటర్‌ రాసిన పాట ఒకటి చాలా బాగా నచ్చింది. దాన్ని రికార్డ్‌ చేసి ఆడియో అందరికీ షేర్‌ చేశాను. అది విని చిరంజీవి ముందుకు వచ్చి ఆల్బమ్‌ చేద్దాం అన్నారు. దాంతో అది మెగా ఆల్బమ్‌ అయిపోయింది. జాతీయ స్థాయిలో రీచ్‌ అయింది. ప్రధాని మోడీ సైతం ట్వీట్‌ చేయడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత కరోనా వారియర్స్‌ అయిన పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ మరొకటి, డాక్టర్స్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఇంకొకటి మూడు పాటలు చేశాను. వీటికీ బాగా రెస్పాన్స్‌ వచ్చింది.

పర్యావరణాన్ని మనం ఎంత డిస్ట్రబ్‌ చేస్తున్నాం? దీని వల్ల మనకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి అనే ఆలోచన రేకెత్తించేలా ‘సేవ్‌ ద వరల్డ్‌’ అనే ఆల్బమ్‌ చేశాను. కొంత కాలంగా జీ తెలుగు చానెల్‌లో నిర్వహిస్తున్న సరిగమప పోటీలతో సహా పలు రియాల్టీ షోస్‌కి జడ్జిగా వ్యవహరిస్తున్నాను. నేను గమనించింది ఏమిటంటే.. ఈ షోస్‌ ద్వారా మంచి టాలెంట్స్‌ వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆ ఫేమ్‌తో కొద్ది రోజులు డబ్బులు సంపాదించుకుని సెటిలైపోతున్నారు గానీ బాలు చిత్ర మాదిరి దీర్ఘకాలం రాణించలేకపోతున్నారు. పాడేటప్పుడు సీనియర్‌ గాయకుల ప్రభావం తమ మీద పడకుండా జాగ్రత్త పడాలి. వాయిస్‌లో కొత్తదనం ప్రయత్నించాలి. అప్పుడే మంచి కెరీర్‌ అందుకుంటారు. సిధ్‌ శ్రీరామ్‌ లాగా... 

మైండ్‌లోనే అంతా ఉంది.. 
ఆరుపదుల వయస్సులోనూ ఇంత హుషారుగా, అంత యంగ్‌గా హుషారుగా ఎలా కనపడుతున్నావని జీ ప్రోగ్రామ్‌ చూస్తున్నవాళ్లు అడుగుతున్నారు. సంగీతం అనే మంచి వ్యాపకంతో పాటు.. మైండ్‌ మీద కంట్రోల్‌ నా ఆరోగ్యానికి ప్రధాన కారణం. ఒకప్పుడు విపరీతంగా సిగిరెట్లు కాల్చేవాడ్ని. మానేయాలనుకుని మానేశాను. అప్పటి నుంచి మైండ్‌ మీద కంట్రోల్‌ ఏర్పడింది. ఏ సమస్య అయినా మన మైండ్‌తోనే ముడిపడి ఉంటుంది. ఎప్పుడూ మనసు నియంత్రించుకునేందుకు ప్రయత్నించాలి. బ్రీతింగ్‌ వ్యాయామాలు మంచివి. డబ్బు సంపాదించాలి కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం ఇంకా అవసరం. ఏ విషయంలోనూ ఒత్తిడి, భయం వద్దు. నిద్రలేమి, టెన్షన్స్, వ్యసనాలే ప్రధాన అనారోగ్య కారణాలు.

ఈ నగరంలో అణువణువూ నాకు ఇష్టమైందే.. 
దాదాపు 22 ఏళ్ల క్రితం అంటే 1998లోనే నేను హైదరాబాద్‌కు షిఫ్టయ్యాను. రెండేళ్ల తర్వాత నా ఫ్యామిలీ కూడా వచ్చేసింది. ప్రస్తుతం నా నివాసం నగరంలోని గండిపేట్‌లో.. బంజారాహిల్స్‌ కాకుండా నా మనస్తత్వానికి తగ్గట్టుగా ప్రశాంతమైన వాతావరణంలో నా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నా..

మంచి మనిషికో పాట.. పంచుకుంటా.. 
మాటల ద్వారా చెప్పడం, కవితల ద్వారా చెప్పడం కన్నా సంగీతం ద్వారా అందరికీ ఇంకా బాగా చేరువవుతుంది. ఏ పదానికి ఏ స్వరం జతపరిస్తే హృదయానికి హత్తుకుంటుందో గుర్తించే జ్ఞానం భగవంతుడు మాకు ఇస్తాడు కాబట్టి మా లాంటి సంగీత దర్శకులు ఇలాంటి సందేశాత్మక గీతాలు చేయాలి. చేస్తాం కూడా. అది మా బాధ్యత. సోషల్‌ కాజ్‌ మీద ఇంకా కొన్ని చేయాలనుంది. స్టార్స్‌ మద్దతు ఇస్తారని నమ్మకం ఉంది.    

మరిన్ని వార్తలు