నటుడిగా అరంగేట్రం చేశా..

7 Aug, 2020 07:33 IST|Sakshi

ప్రతి పాటను తొలిపాటగానే భావిస్తా 

కరోనా నియంత్రణ సమష్టి బాధ్యత 

సంగీత దర్శకుడు కోటి 

సాక్షి, తూర్పుగోదావరి: ఆయనో ప్రముఖ సంగీత దర్శకుడి కుమారుడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. కళ్లల్లోకి కళ్లుపెట్టి చూడవెందుకు.. ఇటువంటి ఎమోషనల్‌ పాటలు, గువ్వ గోరింకతో.. జివ్వుమని కొండగాలి.. అందమా అందుమా ఇలాంటి రొమాంటిక్‌ సాంగ్స్, కోకిల కోకిల కో అన్నది.. ప్రియరాగాలే గుండెలోన వంటి మెలోడీలు చేయడం స్వర కిరీటి సాలూరి కోటేశ్వరరావు(కోటి)కే చెల్లింది. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడంలో 500కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన కోటి సాలూరి రాజేశ్వరరావు కుమారుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాటే నా ప్రాణం.. నా ప్రపంచం అని, ప్రతి సినిమాను తొలి సినిమాగా, ప్రతి పాటను తొలి పాటగానే భావిస్తానని, అందుకే సక్సెస్‌ను అందుకోగలిగానంటున్నారు సంగీత దర్శకుడు కోటి. రాయవరం మండలం పసలపూడి వచ్చిన సందర్భంగా సంగీత దర్శకుడు కోటి పంచుకున్న సంగీత దర్శకత్వ స్వానుభవాలు.. ఆయన మాటల్లోనే.. 

నేను మెచ్చిన బాణీలు 
నేను చేసిన సినిమాలన్నీ సంగీతపరంగా హిట్‌ అయ్యాయి. అన్ని పాటలను మనస్సు పెట్టి చేశా. ప్రియరాగాలే.. ముఠామేస్త్రి.. బావలు సయ్యా.. కోకిల కోకిల.. కదిలే కాలమా.. ఇదేలే తరతరాల చరితం ఇలా అనేక పాటలు నాకు నచ్చినవే.  
తొలిసారి నటుడిగా... 
ఇప్పటి వరకు సంగీత దర్శకత్వం వహిస్తున్న నేను తొలిసారిగా సినిమాలో నటిస్తున్నా. నాన్న కోరిక నన్ను ఐపీఎస్‌గా చూడాలని ఉండేది. అనుకోకుండానే సంగీతం ఆవహించింది. ఇప్పుడు సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్ర చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ‘దేవినేని’ సినిమాలో ఐపీఎస్‌ ఆఫీసర్‌ వేదవ్యాస్‌ క్యారెక్టర్‌ చేశాను. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత స్ట్రిక్ట్‌ పోలీసాఫీసర్‌ పాత్రతో సుగ్రీవ అనే సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరు 
గోదావరి జిల్లావాసులు ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరు. ఇక్కడి పచ్చటి వాతావరణం, గోదావరి అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు మనసును పరవశింపజేస్తాయి. గోదావరి జిల్లావాసులతో ఉన్న అనుబంధం మరువలేనిది, మరపురానిది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత జిల్లాలో పర్యటిస్తా.  

మనసుకు హత్తుకుంటేనే.. 
ప్రజల మనస్సుకు హత్తుకుంటేనే జీవం ఉన్న పాటగా మిగిలి పోతుంది. ఇప్పుడు వస్తున్న సంగీత దర్శకులు కూడా బాగానే చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యే పాటలకు బాణీలు కట్టాలని కొత్తగా వచ్చే సంగీత దర్శకులకు సూచిస్తున్నా.  

తండ్రి నుంచి వారసత్వంగా... 
నా తండ్రి సాలూరు రాజేశ్వరరావు నుంచి సంగీతాన్ని వారసత్వంగా తీసుకున్నా. ఆయన తనయుడిగా పుట్టడమే నా అదృష్టం. సంగీత వారసత్వాన్ని నా రెండో కుమారుడు రోషన్‌ తీసుకున్నాడు. ప్రజలు మెచ్చిన బాణీలను చేయడం వల్లే సక్సెస్‌ పొందగలిగా. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడంలో 500కు పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశా.  

ప్రతి ఒక్కరిదీ బాధ్యత 
కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదే కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. స్వీయ జాగ్రత్తలతోనే కరోనాను దూరం చేయగలం. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే అనవసరంగా బయట తిరగడం మానుకోవాలి. దీన్ని ఒక హెచ్చరికగా అందరూ భావించాలి. పాట రూపంలో చెబితే మనస్సును హత్తుకుంటుందనే కరోనాను తరిమికొట్టాలని పాట రూపొందించా. యావత్‌ ప్రపంచం కనిపించని శత్రువుతో పోరాడుతున్న విషయాన్ని అందరూ గమనించాలి.  

మరిన్ని వార్తలు