టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

22 May, 2023 03:40 IST|Sakshi

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకంది.ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌(68) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని  స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో వెంకట సూర్యనారాయణ రాజు పెద్దవాడు కాగా, తోటకూర సోమరాజు(రాజ్‌) చిన్నవాడు.

1954 జూలై 27న రాజ్‌ జన్మించారు. టీవీ రాజు స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రఘుదేవపురం. అయితే ఆయన చెన్నైలో స్థిరపడటంతో రాజ్‌ అక్కడే పుట్టి, పెరిగారు. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగటంతో రాజ్‌కి సంగీతంపై అవగాహన ఉండేది. చదువులో యావరేజ్‌ స్టూడెంట్‌ అయిన రాజ్‌కి చిన్నతనం నుంచే సంగీతం నేర్పించారు టీవీ రాజు. ఓ వైపు ఇంటర్‌ చదువుతూనే మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు రాజ్‌.

ఆ సమయంలో తన తండ్రి టీవీ రాజు 1973 ఫిబ్రవరి 20న యాభైఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. దీంతో కొద్ది రోజులు ఏం చేయకుండా అలాగే ఉండిపోయిన రాజ్‌ ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ఓ ఏడాది తర్వాత సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా చేరి, ఆరేళ్లు పనిచేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కి మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత 1980లో సంగీత దర్శకుడు ^è క్రవర్తి వద్ద అసిస్టెంట్‌గా చేరారాయన. అప్పుడు చేతినిండా పని ఉండేది.. జేబు నిండా డబ్బులు వచ్చేవి. ఆ సమయంలో 1982 మార్చి 11న రాజ్‌ వివాహం ఉషతో జరిగింది.

రాజ్‌–కోటి ద్వయం...
సంగీత దర్శకునిగా రాజ్‌ అందుకున్న తొలి అవకాశం ‘ప్రళయగర్జన’(1983). మోహన్‌బాబు హీరోగా పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి రాజ్‌కి తొలి సోలో సంగీత దర్శకునిగా అవకాశం వచ్చింది. అయితే తన మిత్రుడు, కొలీగ్‌ అయిన కోటిని కలుపుకొని సంగీతం అందించాలని నిర్ణయించుకున్నారు రాజ్‌. ఆ విషయాన్ని కోటికి చెప్పడం.. ఆయన కూడా ఒప్పుకోవడంతో సంగీత ప్రపంచంలో రాజ్‌–కోటి ద్వయం ప్రారంభమైంది. ‘సంసారం, యముడికి మొగుడు, ఖైదీనంబర్‌ 786, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, ముఠామేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న–తమ్ముడు, శత్రువు’ వంటి ఎన్నో సినిమాలకు వారిద్దరూ సంగీతం అందించారు.

సోలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా...
అనుకోని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్‌ సోలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గానూ తనదైన శైలిలో సంగీతం అందించి శ్రోతలను మైమరపించారు. ‘సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా(నేపథ్య సంగీతం)’.. ఇలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 70 సినిమాలకు పనిచేశారాయన. అలాగే పలు టీవీ సీరియల్స్‌కి కూడా సంగీతం అందించారు. అదేవిధంగా నటుడిగానూ పలు సినిమాల్లో మెరిశారు రాజ్‌.

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ‘హలోబ్రదర్‌’ సినిమాకి 1994లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రాజ్‌–కోటి ద్వయం నంది అవార్డు అందుకున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్, నేపథ్య సంగీత దర్శకుడు, నటుడు.. ఇలా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన రాజ్‌ మృతితో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. రాజ్‌కి భార్య ఉష, కుమార్తెలు దివ్య, దీప్తి, శ్వేత ఉన్నారు.

కాగా హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో నేడు (సోమవారం) రాజ్‌ అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

(చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. బుల్లితెర నటి స్పాట్ డెడ్!)

మాకూ షాకింగ్‌గానే ఉంది
– దివ్య, రాజ్‌ కుమార్తె
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కార్డియాక్‌ అరెస్ట్‌తో నాన్న మృతిచెందారు. ఫ్యామిలీని, అభిమానులను ఎప్పుడూ సంతోషపరిచారాయన. నాన్నగారికి చిరంజీవిగారు ఎప్పుడూ ఓ బ్రదర్‌లా సపోర్ట్‌గా ఉన్నారు. నాన్న మరణంపై స్పందించినందుకు  ఆయనకు థ్యాంక్స్‌. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో కలిసిన నాన్న, కోటి అంకుల్‌ కబుర్లు చెప్పుకున్నారు. నాన్న మరణవార్త చెప్పగానే అంకుల్‌ షాక్‌ అయ్యారు.

మా పాటల రూపంలో బతికే ఉంటారు
– కోటి, సంగీత దర్శకుడు
నేను చెన్నైలో ఉండగా రాజ్‌ చనిపోయారనే చేదు వార్తను విన్నాను. ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. తనకు ఆరోగ్య సమస్యలున్నట్టు నాకు అనిపించలేదు. రాజ్‌ కూడా నాతో చెప్పలేదు. చక్రవర్తిగారి వద్ద మేమిద్దరం అసిస్టెంట్లుగా పనిచేశాం. రాజ్‌–కోటిగా ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చాం. మేం విడిపోయిన తర్వాత కూడా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్‌–కోటి పాటలు అనేవారు. అలాంటిది ఈ రోజు నా రాజ్‌ లేడంటే ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటాడు.

మరిన్ని వార్తలు