ఆయనతో తొలి హిట్‌ సాధించా!

7 Oct, 2022 05:26 IST|Sakshi

– ఎస్‌ఎస్‌ తమన్‌  

‘‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీమియర్‌ తర్వాత చిరంజీవిగారు ప్రేమగా హత్తుకున్నారు.. సినిమా రిలీజ్‌ తర్వాత ఆయన ప్రశంసించడం మర్చిపోలేను. దర్శకుడు శంకర్‌గారు, సంగీతదర్శకులు మణిశర్మ, కోటిగార్లు ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్పారు. చాలామంది మెగా ఫ్యాన్స్‌ ఫోన్‌ చేసి, భావోద్వేగంగా మాట్లాడటం హ్యాపీ’’ అని సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. సల్మాన్‌ ఖాన్, నయన తార, సత్యదేవ్‌ కీలక పాత్రలు చేశారు.

కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ – ‘‘నేను తొలిసారి పని చేసిన హీరోలందరి సినిమాలు హిట్టయ్యాయి. ఇప్పుడు చిరంజీవిగారితో చేసిన తొలి సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ హిట్‌ అయి, నా సెంటిమెంట్‌నిæకొనసాగించింది. నా ఆరేళ్ల వయసులో మా అమ్మగారితో కలిసి కోటిగారి రికార్డింగ్‌ స్టూడియోకి వెళ్లాను. ‘అందం హిందోళం..’ పాట రికార్డింగ్‌ జరుగుతోంది.

ఆ పాట విని చిరంజీవిగారికి ఫ్యాన్‌ అయ్యాను. అప్పటి నుండి ఇంట్లో ఎప్పుడూ చిరంజీవిగారి పాటలే వాయిస్తూ ఉండేవాణ్ణి. చిరంజీవిగారు మహా వృక్షం. ఒక ఫ్యాన్‌గా నేను ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా చేశాను. ఆయన సినిమాకి మ్యూజిక్‌ చేయడం తేలికైన విషయం కాదు. పైగా మ్యూజిక్‌కి స్కోప్‌ లేని సినిమాలో మ్యూజికల్‌గా హై తీసుకురావడం చాలెంజ్‌. లండన్‌లోని అబేయ్‌ రోడ్‌ స్టూడియోలో రికార్డ్‌ చేసిన తొలి భారతీయ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మనం ఓ కమర్షియల్‌ సినిమా చేద్దామని చిరంజీవిగారిని అడిగితే, చేద్దామన్నారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు