కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి...

2 Mar, 2021 14:34 IST|Sakshi

విద్యాసాగర్‌ పేరు చెప్పగానే ‘ఏ అంటే అమల బి అంటే భానుప్రియ’ వంటి అల్లరి పాటలు వినిపిస్తాయి. ‘చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతిపూల మేడ కట్టనా’ అనే కమర్షియల్‌ హిట్స్‌ గుర్తుకొస్తాయి. ‘చుక్కా చుక్కా కన్నీటి చుక్కా బుగ్గన జారొద్దు’ వంటి సెంటిమెంట్‌ పాటలు కదిలిస్తాయి. ‘తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా’ వంటి మెలొడీలు చుట్టుముడతాయి. విద్యాసాగర్‌ మరో ఇళయరాజాగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు. విజయనగరం నుంచి వచ్చిన తెలుగు గీతమే అయినా తమిళంలో, మలయాళంలో ఎక్కువ గుర్తింపు పొందాడు. మార్చి 2 ఆయన పుట్టినరోజు.

బొబ్బిలి సంస్థానం నుంచి...
విద్యాసాగర్‌ తాత తండ్రులది బొబ్బిలి సంస్థానం. వాళ్లది సంగీత కుటుంబం. విద్యాసాగర్‌ తండ్రి రామచందర్‌ సినిమాల్లో పని చేయాలని 1950లలోనే మద్రాసు వచ్చారు. విద్యాసాగర్‌ అక్కడే పెరిగారు. తండ్రి వద్ద తొలి సంగీత విద్యలు నేర్చుకుని 11 ఏళ్ల వయసులో లండన్‌ ట్రినిటి కాలేజ్‌లో సంగీతం నేర్చుకున్నారు. విద్యాసాగర్‌ మొదట రీరికార్డింగ్‌లో  గుర్తింపు పొందారు. వందలాది సినిమాలకు రీరికార్డింగ్‌ చేశారు. ఆ తర్వాత తమిళంలో మొదట... తర్వాత తెలుగులో సంగీత దర్శకుల య్యారు. రెండు చోట్లా కొన్ని అపజయాల తర్వాత మలయాళంలో హిట్‌ కొట్టి తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో హిట్స్‌ ఇచ్చారు.

మెలొడీస్‌ ఇష్టం
విద్యాసాగర్‌కు మెలొడీలు ఇష్టం. ‘ఓ చినదానా’లో ‘తన చిరునామా అడిగితే ప్రేమ నిను చూపెడుతోందే’ అలాంటి మెలొడీనే. ‘చిత్రం భళారే విచిత్రం’లో ‘నవ్వుకునే మన యవ్వనమే ఒక పువ్వుల తోటంట’ కూడా అదే మెలొడీ. రాజశేఖర్‌ నటించిన ‘విలన్‌’లో ‘నా గుండె గుడి లో నువు శిలవా దేవతవా’ పెద్ద హిట్‌. ఇక తమిళం నుంచి తెలుగులోకి డబ్‌ అయిన మెలొడీలు కూడా హిట్టే. అర్జున్‌ నటించిన ‘కర్ణ’ సినిమాలో ‘పలికే మౌనమా’ చాలా పెద్ద హిట్‌. అన్నింటికి మించి ‘చంద్రముఖి’ కోసం చేసిన ‘కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి’ క్లాసిక్‌గా నిలిచింది. ‘చంద్రముఖి’ విద్యాసాగర్‌ ను టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నిలిపింది. అందులోని ‘చిలకా పద పదా’, ‘రారా సరసకు రారా’ అద్భుతంగా అమరాయి. విద్యాసాగర్‌ కె.విశ్వనాథ్‌ ‘స్వరాభిషేకం’కు, బాపు ‘సుందరకాండ’కు పనిచేశారు. పవన్‌ కల్యాణ్‌ ‘బంగారం’ సినిమాకు ‘రా..రా.. రారా బంగారం’ మాస్‌ హిట్‌ ఇచ్చారు. విద్యాసాగర్‌ మరెన్నో మంచి పాటలు అందించాలని కోరుకుందాం. 

మరిన్ని వార్తలు