భయానక పరిస్థితి.. చావు అంచుల దాకా వెళ్లాను: నటి

21 Apr, 2021 17:50 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ యావత్‌ దేశాన్ని కలవరపెడుతుంది. రోజు వారి నమోదయ్యే కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువవుతుంది. ఆస్పత్రులన్ని కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. చాలా చోట్ల బెడ్స్‌ లేక బయటే పడిగాపులు గాస్తున్నారు. సామాన్యులే కాక సెలబ్రిటీలు కూడా కోవిడ్‌ బారిన పడుతున్నారు. వీరిలో నాగిని ఫేం నటి కాజల్‌ పైసల్‌ కూడా ఉన్నారు. కోవిడ్‌ వల్ల తాను ఎంతో బాధపడ్డానని.. మరణం అంచుల దాకా వెళ్లి వచ్చానని తెలిపారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు కాజల్‌ పైసల్‌. 

ఈ సందర్భంగా కాజల్‌ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో అత్యంత దుర్భర క్షణాలు అంటే కోవిడ్‌తో బాధపడటమే. ప్రారంభంలో కొద్దిగా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వెళ్లి టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. అయితే అప్పుడు మరి అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. నా డాక్టర్‌ కూడా నేను త్వరగానే కోలుకుంటానని తెలిపింది. ఓ నెల రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులంతా నాకు ధైర్యం చెప్పారు. వారం, రెండు వారాల్లో అంతా సెట్‌ అవుతుంది అన్నారు. నేను కూడా అదే ధైర్యంతో ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు కాజల్‌.

‘‘కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. రోజులు గడుస్తున్న కొద్ది నా ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. కొద్ది రోజుల తర్వాత నాకు విపరీతంగా తల తిరిగేది. నా శరీరం మీద నేను అదుపు కోల్పోతున్నట్లు అనిపించేది. అది చాలా భయంకర అనుభవం. ఎంతో నిరాశకు గురయ్యేదాన్ని. ఒకానొక సమయంలో మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాను’’ అంటూ కాజల్‌ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించారు.

‘‘అభిమానుల ప్రార్థనలు, దేవుడి దయ, వైద్యులు, కుటుంబ సభ్యుల మద్దతుతో కోలుకున్నాను. కోవిడ్‌ నెగిటివ్‌ అని తేలింది. కానీ ఇప్పడు కూడా చాలా నీరసంగా ఉంటుంది. డిప్రెషన్‌కు గురవుతున్నాను. ఈ సందర్భంగా నా అభిమానులకు ఓ విన్నపం. కోవిడ్‌ను తేలికగా తీసుకోకండి. క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది కదా అనుకోకండి. అదేంత నరకమో అనుభవించిన వారికే తెలుస్తుంది. నిజంగా ఇది ఒక భయానక పీడకల. నా జీవితంలో ఇన్ని రోజుల మంచానికే అంకితం అవుతానని.. ఇంత నీరసీస్తానని ఎప్పుడు ఊహించుకోలేదు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. కోవిడ్‌ నియమాలు పాటించండి’’ అని కోరారు కాజల్‌.

చదవండి: టీవీ బ్రేక్‌లో వచ్చే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?

మరిన్ని వార్తలు