వానలకు పర్ఫెక్ట్‌ అవే

8 Aug, 2021 00:27 IST|Sakshi
నభా నటేశ్‌

‘టిప్‌ టిప్‌ బర్సా పానీ’ పాట అంటే నభా నటేశ్‌కి చాలా ఇష్టం. అక్షయ్‌కుమార్, రవీనా టాండన్‌ తడుస్తూ పాడుకున్న వాన పాట ఇది. ఈ పాట అంటే నభాకి చాలా ఇష్టం కానీ వానలో తడవడం అంటే ఆమెకు కష్టం. మరి.. ఏడాదంతా దాదాపు వానలు చూస్తూ పెరిగితే అలానే ఉంటుంది. ఇక ‘వానాకాలమ్‌’ గురించి నభా నటేశ్‌ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.

► వర్షాలప్పుడు కాగితపు పడవలు చేసేవారా?
 కాగితపు పడవల ఎంజాయ్‌మెంట్‌ మిస్సయ్యేదాన్ని కాదు. ఇంటి దగ్గరే చిన్న స్ట్రీట్‌లో పడవలు వదిలేదాన్ని. అది కూడా నేను తడవకుండా.

► చివరిసారిగా ఫుల్లుగా ఎప్పుడు తడిశారు?
ఓ సినిమా షూట్‌లో భాగంగా బాగా తడిశాను. కానీ సినిమా షూటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన కృత్రిమ వర్షం అది. అయితే వర్షాల్లో తడవడం నాకు ఇష్టం ఉండదు.

► వర్షాకాలాన్ని ఎలా ఆస్వాదిస్తారు?
రెయినీ సీజన్‌లో ఫుడ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తాను. పుట్టింది తినడం కోసమే అన్నట్లుగా తింటాను. మా అమ్మ చేసే ఫ్రైడ్‌ అండ్‌ స్పైసీ మిర్చి బజ్జీలు, కాఫీ నా ఫేవరెట్‌. వర్షం పడుతున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్‌.

► వానా కాలంలో మీరు తీసుకునే జాగ్రత్తలు?
చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాను. కొంచెం తడిసినా నాకు వెంటనే జలుబు చేస్తుంది. అందుకే పెద్దగా తడవాలనుకోను. ఎప్పుడు బయటకు వెళ్లినా నా వెంట గొడుగును తీసుకుని వెళతాను. టిష్యూ పేపర్స్‌ను కూడా క్యారీ చేస్తుంటాను.

► ఈ సీజన్‌లో మీ డ్రెస్సింగ్‌ స్టయిల్‌ ఎలా ఉంటుంది?
వర్షాకాలంలో బయటకు వెళితే ఎవరూ గుర్తుపట్టలేనంతగా నన్ను నేను కవర్‌ చేసుకుంటాను. స్వెటర్, షూస్, రెయిన్‌ కోట్, క్యాప్‌... ఇలా నా ముఖం తప్పు ఇంకేమీ కనిపించకుండా కవర్‌ చేసుకుంటాను.

► మామూలుగా పిల్లలను వర్షంలో తడనివ్వరు. మరి.. చిన్నప్పుడు మీ ఇంట్లో?
వర్షాలు అప్పుడప్పుడూ అంటే ఓ మజా ఉంటుంది. కానీ మా ప్రాంతంలో ఎప్పుడూ అవే కదా. పైగా బాగా చలిగా ఉండేది. దాంతో నాకే బయటకు వెళ్లాలనిపించేది కాదు. మా అమ్మకు కోప్పడే పని తప్పింది (నవ్వుతూ).

► మరి..  వానపాటల్లో నటించడం మీకిష్టమేనా?
పెద్దగా ఇష్టం లేదు కానీ వాన కురుస్తున్నప్పుడు ఇంట్లోనే ఉండి, రెయినీ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేయడం ఇష్టం.

► నచ్చిన వాన పాట?
‘టిప్‌ టిప్‌ బర్సా పానీ’ (అక్షయ్‌కుమార్, రవీనా టాండన్‌ నటించిన ‘మొహ్రా’ చిత్రంలోని పాట) అంటే చాలా ఇష్టం.

► చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలు...
వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే చిక్‌మగలూర్‌ నా స్వస్థలం. నా చిన్నతనంలో మాప్రాంతం ఎప్పుడూ చిత్తడి చిత్తడిగా ఉండేది. అంతా బురదమయం. వర్షాకాలంలో నేను నాలుగైదు రకాల స్లిప్పర్స్‌ను మార్చేదాన్ని. అందుకే ఈ సీజన్‌ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఏదైనా పని కోసం బయటకు వెళ్లినప్పుడు వర్షంలో చిక్కుకుపోవాల్సి వస్తుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు స్కూల్స్‌కు వారాల పాటు సెలవులు ఇచ్చేవారు. వర్షాకాలపు జ్ఞాపకాలంటే ఇబ్బందులు తప్ప తీపి అనుభూతులు ఏవీ లేవు.

మరిన్ని వార్తలు