Nachindi Girl Friendu Review: ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ రివ్యూ

11 Nov, 2022 08:25 IST|Sakshi
Rating:  

టైటిల్‌: నచ్చింది గాళ్ ఫ్రెండూ
నటీనటులు: ఉదయ్ శంకర్, జెన్నీఫర్ ఇమ్మానుయేల్,  సుమన్,  మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ 
నిర్మాణ సంస్థ:శ్రీరామ్‌ మూవీస్‌  
నిర్మాత: అట్లూరి నారాయణ రావు
దర్శకత్వం: గురు పవన్
సంగీతం: గిఫ్టన్
సినిమాటోగ్రఫర్‌:సిద్దం మనోహార్
ఎడిటర్‌: ఉడగండ్ల సాగర్
విడుదల తేది: నవంబర్‌ 11,2022

కథేంటంటే..
ఈ సినిమా కథంతా ఒకే రోజులో జరుగుతుంది. బీకామ్‌ చదివిన రాజా(ఉదయ్‌ శంకర్‌) జులాయిగా తిరుగతూ.. షేర్‌ మార్కెట్‌లో పెడ్డుబడులు పెడుతుంటాడు. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలలో శాండీ(జెన్నీఫర్‌ ఇమ్మానుయేల్‌) ఫోటో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. స్నేహితుడు చెర్రీ( మధునందన్) ఇంటర్వ్యూ కోసమని బైక్‌పై వెళ్తుంటే దారి మధ్యలో శాండీ కనిస్తుంది. ఆ రోజు శాండీ బర్త్‌డే. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేందుకు శాండీ వెళ్తుంటే.. ఓ అపరిచితుడి నుంచి ఆమె మొబైల్‌ ‘ఈ రోజు నువ్వు ఎవరితో మాట్లాడినా..వాళ్లు చనిపోతారు’ అనే సందేశం వస్తుంది. కానీ శాండీ దాన్ని జోక్‌గానే తీసుకుంటుంది.

అయితే నిజంగానే శాండీ ఎవరితో మాట్లాడిన వారు హత్య చేయబడతారు. రాజా కూడా శాండీతో మాట్లాడతాడు. ప్రేమిస్తున్నానని చెబుతాడు. శాండీ కూడా రాజాని ప్రేమించినట్లు చేస్తుంది. కట్‌ చేస్తే..కాసేపటికే రాహుల్‌ అనే వ్యక్తి తన జీవితంలో ఉన్నాడని, త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతుంది. శాండీ ఎందుకలా చేసింది? ఆమె నేపథ్యం ఏంటి? శాండీకి సందేశం పంపిన ఆ అపరిచితుడు ఎవరు? ఆమెతో మాట్లాడిని వారిని ఎందుకు హత్య చేశారు? విక్రమ్‌ రాయ్‌ ఎవరు?  కృష్ణ పాండే(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) వల్ల ఈ  కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆపదలో ఉన్న శాండీని రాజా ఎలా కాపాడాడు? చివరకు రాజా,శాండీ ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇది. సినిమాలో  ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి.  దర్శకుడు గురు పవన్ ఓ లవ్‌స్టోరీని  ఆన్ లైన్ ట్రేడింగ్‌తో ముడిపెట్టి కథను రాసుకున్నాడు.  ఫస్టాఫ్‌ అంతా రొటీన్‌ లవ్‌ సీన్స్‌తో సోసోగా సాగుతుంది. శాండీని రోడ్డుపై చూడడం.. ఆమె వెంటపడడం.. చివరకు రాజా ప్రేమలో శాండీ పడడం..ఇలా ప్రథమార్థం సింపుల్‌గా సాగుతుంది. కానీ అసలు ఆ మర్డర్లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలు ఆడియన్స్‌లో ఎంతో ఆసక్తిని రేకిస్తాయి. ఇంటర్వెల్‌ ముందు కాస్త సస్పెన్స్‌ వీడుతుంది. ఇక సెకండాఫ్‌ తర్వాత అసలు కథ మొదలవుతుంది. షేర్‌ మార్కెట్‌ మోసాలు, మధ్య తరగతి వాళ్ల మీద ఉండే ప్రభావం తదితర అంశాలను టచ్‌ చేస్తూ సెకండాఫ్‌ సాగుతుంది. క్లైమాక్స్‌లో హీరో చెప్పే స్పీచ్‌ బాగుంటుంది. సెకండాఫ్‌ మాదిరే ఫస్టాఫ్‌ కూడా బలంగా ఉండి ఉండే సినిమా ఫలితం మరోలా ఉండేది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడేవాళ్లకి ‘నచ్చింది గాల్‌ ఫ్రెండూ’ నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
సినిమా అంతా ఉదయ్ శంకర్, జెన్నీఫర్ చుట్టే తిరుగుతుంటుంది. రాజా పాత్రకి ఉదయ్‌ శంకర్‌ న్యాయం చేశాడు. ఫస్టాఫ్‌లో లవర్‌ బాయ్‌గా కనిపిస్తూనే.. సెకండాఫ్‌లో తనలోని మాస్‌ యాంగిల్‌ని చూపించాడు. డైలాగ్స్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. శాండీగా జెన్నీఫర్ ఇమ్మానుయేల్ మెప్పించింది. ఆమెకిది తొలి సినిమా.అయినప్పటికీ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది.

మధు నందన్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. కృష్ణ పాండే పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఒదిగిపోయాడు. తెరపై కనిపించేదే కాసేపే అయినా.. కథను మలుపు తిప్పే పాత్ర తనది. సుమన్‌, పృధ్వీరాజ్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. గిఫ్టన్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సిద్దం మనోహార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వైజాగ్‌ అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్‌ ఉడగండ్ల సాగర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచేప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు