చైతూ, సాయి పల్లవి ‘లవ్ ‌స్టోరీ’ టీజర్‌ రిలీజ్‌

10 Jan, 2021 12:18 IST|Sakshi

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లవ్‌ స్టోరీ’. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్‌ వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక త్వరలోనే సినిమా రిలీజ్‌ తేదీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ‘లవ్‌ స్టోరీ’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. చదవండి: సమంతకు నో చెప్పిన నాగచైతన్య!

నిమిషం నిడివి గల ఈ టీజర్‌ను యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా రూపొందించారు. జీవితంలో గొప్పగా స్థిరపడేందుకు చైతూ, పల్లవి ఇద్దరూ పడిన కష్టాలు, వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమను శేఖర్‌ కమ్ముల తనదైన శైలిలో అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాలో నాగ చైతన్య తెలంగాణ యువకుడు రేవంత్‌గా కనిపించనున్నాడు. మౌనిక అనే అమ్మాయిగా సాయి పల్లవి నటించింది. ప్రేమ, వినోదం, కుటుంబ భావోద్వేగాలు ఇలా అన్నింటిని కలిపిన లవ్‌ స్టోరీగా రూపొందించారు. టీజర్‌లో ‘ఆ సాఫ్ట్ వేర్ జాబ్ ఏం చేస్తావ్.. కళ్లాద్దాలు వస్తాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది.. జుట్టు మొత్తం ఊశిపోతుంది’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తంగా టీజర్‌ చూస్తుంటే శేఖర్‌ కమ్ముల ఖాతాలో మంచి హిట్‌ పడటం ఖాయమయ్యేలా అనిపిస్తోంది. ఫిదా వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అనంతరం ఆయన తెరకెక్కిస్తున్న అందమైన ‘లవ్‌ స్టోరీ’ ఇది.  మరి ఈ యువ ప్రేమ కథ అభిమానులకు ఎంత వరకు రీచ్‌ అవుతుందో వేచి చూడాలి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు