కస్టడీ నాకు స్పెషల్‌ ఫిల్మ్‌

4 May, 2023 01:29 IST|Sakshi
పవన్‌ కుమార్, శ్రీనివాసా, నాగచైతన్య, కృతి, వెంకట్‌ ప్రభు

– నాగ చైతన్య

‘‘ఎప్పటికప్పుడు ట్రెండ్‌ మారుతోంది. మూసధోరణి సినిమాలను ప్రేక్షకులు రిజెక్ట్‌ చేస్తున్నారు. అందుకే నా ప్రతి సినిమాకు కొత్త వేరియేషన్‌ చూపించాలనుకుంటున్నా. ఇందులో భాగంగానే ‘కస్టడీ’ సినిమా చేశాను. గతంలో నేను తమిళ దర్శకులతో చేసిన సినిమాలను తెలుగులో మాత్రమే తీశాం. కానీ ‘కస్టడీ’ సినిమాలోని ప్రతి సీన్‌ని తెలుగు, తమిళ భాషల్లో తీశాం. నా తొలి తమిళ చిత్రం ‘కస్టడీ’. అందుకే ఇది నాకు స్పెషల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా నాకో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు నాగచైతన్య.

వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీశెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ‘కస్టడీ’ సినిమా ప్రెస్‌మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఓ సింపుల్‌ కానిస్టేబుల్‌ చేతిలో ఉన్న ఓ పవర్‌ఫుల్‌ నిజం కోసం అతను ఎంత దూరమైనా వెళ్తాడు.. అంటూ వెంకట్‌ప్రభుగారు చెప్పిన స్టోరీ లైన్‌ నాకు బాగా నచ్చి ‘కస్టడీ’ ఒప్పుకున్నాను.

వెంకట్‌ప్రభుగారి ట్రేడ్‌ మార్క్‌ స్క్రీన్‌ ప్లే తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని నమ్ముతున్నాను. అలాగే ఆయన ‘కస్టడీ’స్టోరీ సింపుల్‌గా ఉంటుందని చెబుతున్నారు కానీ మా సినిమాలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. అలాగే నా సినిమాకు ఇళయరాజా, యువన్‌శంకర్‌గార్లు మ్యూజిక్‌ ఇవ్వడం అనేది నా కల నిజమైనట్లు ఉంది’’ అని అన్నారు. ‘‘సాధారణంగా సినిమాల్లో విలన్‌ని హీరో, హీరోని విలన్‌ చంపాలనుకుంటారు. కానీ విలన్‌ చనిపోకుండా హీరో కాపాడడమే ‘కస్టడీ’ స్టోరీ లైన్‌.

తెలుగులో నా తొలి చిత్రం ‘కస్టడీ’. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ ఫిల్మ్‌ ఇది. కథను, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన చైతూ, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు వెంకట్‌ ప్రభు. ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్‌ అయ్యాను. ఆడియన్స్‌ కూడా ఇదే ఫీలవుతారని ఆశిస్తున్నాను’’ అన్నారు కృతీశెట్టి. ‘‘కస్టడీ’ బిజినెస్‌ పట్ల హ్యాపీగా ఉన్నాం. ప్రేక్షకుల స్పందనను బట్టి కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి.

అభిమానులకు మంచి సక్సెస్‌ ఇవ్వాలనే అనుకుంటాం. వారి అభిమానం, ప్రేమలకు మేం తిరిగి ఇచ్చేది ఒక మంచి సినిమాయే. రీసెంట్‌గా మా నుంచి వచ్చిన కొన్ని సినిమాలకు మంచి రిజల్ట్‌ రాలేదు. యాక్టర్స్‌ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. ఈ టైమ్‌  (బ్యాడ్‌ ఫేస్‌ అని పరోక్షంగా చెబుతూ..) వెళ్లిపోతుంది. తప్పకుండా మేం తిరిగి పుంజుకుంటాం. ఫ్యాన్స్‌ ఆశించే ఫలితం ‘కస్టడీ’ నుంచి రాబోతుందని నమ్ముతున్నాను. నాన్నగారి ‘శివ’ సినిమా అంటే అందరి ఆడియన్స్‌లానే నాకు చాలా గౌరవం. ‘కస్టడీ’లో నా క్యారెక్టర్‌ పేరు శివ అయినప్పటికీ ‘శివ’ సినిమా మీద ఉన్న గౌరవంతో మా సినిమాకు ఆ టైటిల్‌ పెట్టలేదు.
– నాగచైతన్య

>
మరిన్ని వార్తలు