కోట్లు కావాలంటున్న నాగశౌర్య!

24 Feb, 2021 13:01 IST|Sakshi

పారితోషికం తగ్గించేది లేదంటున్న నాగశౌర్య

ప్రస్తుతం లక్ష్య సినిమాతో బిజీబిజీ

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే వెండితెర మీద అడుగు పెట్టాడు హీరో నాగశౌర్య. తనను తాను నిరూపించుకోవడానికి దాదాపు ఐదేళ్లు కష్టపడ్డాడు. ఒకానొక సమయంలో ఈ ఫీల్డ్‌ చుట్టూ తిరగడం మాని పెట్టేబేడా సర్దుకుని ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో వారాహి చలన చిత్రం నటీనటులు కావలెను అన్న యాడ్‌ చూశాడు. తన ఫొటో, వివరాలు పంపాడు. అయినా తనకెందుకు వస్తుందీ అవకాశం అని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి అతడికి పిలుపు వచ్చింది. అది కూడా ప్రధాన హీరోగా.

ఇది కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించడంతో అతడు వెనుదిరిగి చూసుకోలేదు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అశ్వథ్థామతో పలకరించిన అతడు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. అయినప్పటికీ నాగశౌర్యకు డిమాండ్‌ ఏమాత్రం తగ్గనట్లు కనిపిస్తోంది. అతను సినిమాకు సంతకం చేయాలంటే నాలుగు కోట్ల రూపాయలు అడుగుతున్నాడట. దానికి ఒక్క పైసా తక్కువైనా ఒప్పుకునేదే లేదని కరాఖండిగా చెప్తున్నాడట. దీంతో కథ చెప్పడానికి వెళ్లిన దర్శకులు ఈ యంగ్‌ హీరో డిమాండ్‌ చేస్తున్న రెమ్యూనరేషన్‌ విని ఒక్కసారిగా షాకవుతున్నట్లు సమాచారం. నాగశౌర్య ఉన్నట్టుండి తన పారితోషికాన్ని ఇంతలా పెంచాడేంటని తలలు పట్టుకుంటున్నారు.

ఇదిలా వుంటే ప్రస్తుతం ఈ హీరో 'లక్ష్య' సినిమా మీద ఫోకస్‌ చేశాడు. ఇందుకోసం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. మరాఠీ, బాలీవుడ్‌ నటుడు సచిన్‌ ఖడేకర్‌ హీరో తాతయ్యగా కనిపించనున్నాడు. సుబ్రహ్మణ్యపురం ఫేమ్‌ సంతోష్‌ జాగర్లపూడి దీనికి దర్శకత్వం వహిస్తుండగా నారాయణ్‌దాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, పీ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ లక్ష నాగశౌర్యను హిట్‌ ట్రాక్‌ ఎక్కిస్తుందేమో చూడాలి!

చదవండి: నాగశౌర్య సరసన హాట్‌ బ్యూటీ ఎంట్రీ

అలా మొదలైంది అంత హిట్టవ్వాలి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు