25.. 50.. 75.. 100..మన స్టార్‌ హీరోలు ఎంత దూరం వచ్చారంటే..

4 Dec, 2022 10:29 IST|Sakshi

ప్రయాణంలో ఎంత దూరం చేరుకున్నామో మైల్‌ స్టోన్‌ చెబుతుంది. అందుకే మైల్‌ స్టోన్‌ చాలా స్పెషల్‌. ఇక సినిమా స్టార్స్‌కి అయితే  కెరీర్‌ పరంగా ఎంత దూరం వచ్చారో సినిమా నంబర్స్‌ చెబుతాయి. 25.. 50.. 75.. 100... ఈ నంబర్స్‌ స్టార్స్‌ కెరీర్‌కి చాలా స్పెషల్‌. ఒకటో సినిమా నుంచి ఇరవైఅయిదవ సినిమాకి చేరుకోవడం ఓ మైల్‌స్టోన్‌. ఆ తర్వాత 50.. 75.. 100.. ఇలా ఒక్కో మైల్‌ స్టోన్‌ దాటుతున్నప్పుడు వారికి దక్కే ఆనందం అంతా ఇంతా కాదు. పైగా ఆ సినిమాలు స్పెషల్‌గా ఉండాలని కూడా కోరుకుంటారు. ప్రస్తుతం 25, 75, 100 చిత్రాల మైల్‌ స్టోన్‌ మూవీస్‌ చేస్తున్న స్టార్స్‌పై ఓ లుక్‌ వేయండి. 

కెరీర్‌లో వందో సినిమాను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు హీరో నాగార్జున. ఆల్రెడీ నాగార్జున కొన్ని కథలు విన్నారు. మరికొన్ని కథలు వినడానికి రెడీ అవుతున్నారు. కాగా తన గత చిత్రం ‘ది ఘోస్ట్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వేదికగా తాను, అఖిల్‌ కలిసి ఓ మలీ్టస్టారర్‌ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు నాగార్జున. ఇదే ఆయన కెరీర్‌లో వందో సినిమాగా ఉండబోతుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అలాగే తమిళ దర్శకుడు మోహన్‌రాజా, బెజవాడ ప్రసన్న కుమార్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. నాగార్జున వందో చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇంకెందరి దర్శకుల పేర్లు వస్తాయో? ఫైనల్‌గా ఎవరు ఖరారవుతారో చూడాలి.

మరోవైపు ప్రభాస్‌ కెరీర్‌లో రూపొందనున్న 25వ చిత్రం ఖరారైపోయింది. ‘స్పిరిట్‌’ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకు ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటు సందీప్‌రెడ్డి వంగా కూడా రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యాని మల్‌’ సినిమా చేస్తున్నారు. సో.. ‘స్పిరిట్‌’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ 2024లో ఆరంభం అయ్యే అవకాశం ఉంది.

ఇక తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. కార్తీ హీరోగా చేసిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్‌ అవుతుంటాయి. ప్రస్తుతం కార్తీ కెరీర్‌లో 25వ చిత్రం ‘జపాన్‌’ తెరకెక్కుతోంది. రాజు మురుగన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారట.

ఇంకోవైపు హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల మెప్పు పొందిన సత్యదేవ్‌ 25వ సినిమాగా ‘కృష్ణమ్మ’లో నటిస్తున్నారు. వీవీ గోపాలకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఓ నిర్మాత. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఇక పదిహేనేళ్లుగా ఏ మాత్రం స్టార్‌డమ్‌ తగ్గకుండా కొనసాగుతున్న నయనతార 75 చిత్రాల మైల్‌స్టోన్‌ను చేరుకున్నారు. ఈ సినిమాతో నీలేష్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.  వీరే కాదు..75 చిత్రాల మైలు రాయికి రవితేజ, 25 చిత్రాల మైలురాయికి అల్లు అర్జున్, నాగశౌర్య.. ఇలా మైల్‌స్టోన్‌ చిత్రాలకు దగ్గరగా ఉన్న స్టార్స్‌ ఇంకొందరు ఉన్నారు.

మరిన్ని వార్తలు