ప్రేమించి పని చేస్తే శ్రమ తెలియదు  – నాగార్జున

4 Apr, 2021 10:40 IST|Sakshi
అహిషోర్, నాగార్జున, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి

‘‘వైల్డ్‌డాగ్‌’ ప్రతి భారతీయుడూ చూడాల్సిన సినిమా అని అభినందనలు వస్తున్నాయి. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్సెస్‌ చేయడం నాకు రిస్క్‌ అనిపించలేదు. నా లైఫే రిస్కీ. ప్రేమించి పని చేసేటప్పుడు శ్రమ ఉండదు. ఏదైనా కొత్తగా సాధించాలనే ఆకలి నాలో ఇంకా ఉంది’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది.

శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘కోవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సినిమాను విడుదల చేయాలా? ఆడియన్స్‌ వస్తారా? అనుకున్నాం. కానీ మంచి సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందనే నమ్మకంతో రిలీజ్‌ చేశాం. ఈ సినిమా రెస్పాన్స్, కలెక్షన్స్‌ బాగున్నాయని నిర్మాతలు చెబుతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు నాగార్జున. ‘‘ఈ సినిమా సక్సెస్‌ వెనక టీమ్‌ అందరి కష్టం ఉంది. నాకు అవకాశం ఇచ్చిన నాగ్‌ సార్, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు అహిషోర్‌. ‘‘బాక్సాఫీస్‌ కోణంలో ఆలోచించి ఈ సక్సెస్‌మీట్‌ పెట్టలేదు. మా ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యామని ఈ మీట్‌ పెట్టాం. మీ బేనర్‌లో మరో మంచి సినిమా వచ్చిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు నిరంజన్‌రెడ్డి. ‘‘ఈ సినిమాను గ్రాండ్‌ సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు అన్వేష్‌ రెడ్డి.

టేస్ట్‌ అదిరిపోయింది
‘వైల్డ్‌డాగ్‌’ రిలీజ్‌ సందర్భంగా కుటుంబసభ్యులందరూ ప్రీమియర్‌ షోలతో బిజీ అయిపోయారు. ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. అప్పుడు  చిరంజీవిగారు ఫోన్‌ చేసి, ఏం చేస్తున్నావ్‌? అన్నారు. ఏం లేదని చెప్పాను. రాజమండ్రి నుంచి ‘సీ ఫుడ్‌’ ఐటమ్స్‌ వచ్చాయి... రమ్మన్నారు. వెళ్లాను. చిరంజీవిగారు వండి పెట్టారు. టేస్ట్‌ అదిరిపోయింది. మా పాత సినిమాలు, రిలీజ్‌ సమయంలో ఉండే టెన్షన్స్‌ వంటి వాటి గురించి మాట్లాడుకున్నాం.

నాన్న బయోపిక్‌ తీయాలనే ఉంది!
మా నాన్నగారి (దివంగత ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు) బయోపిక్‌ తీయాలనే ఉంది. కానీ ఏమైనా పొరపాట్లు జరుగుతాయా అనే భయం కూడా ఉంది. ‘మనం’ సినిమా తీసే సమయంలో కూడా ఇదే భయం ఉండేది. కానీ భయం ఉన్నప్పుడే మరింత జాగ్రత్తగా పని చేస్తాం.

మరిన్ని వార్తలు