అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తున్న నాగ్‌ ‘వైల్డ్‌ డాగ్’

25 Apr, 2021 12:49 IST|Sakshi

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో న‌టించిన‌ చిత్రం ‘వైల్డ్ డాగ్​’. ఎన్నో అంచనాల నడుమ మార్చి 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో థియేట‌ర్‌లో విడుదలైన 19 రోజుల‌కే ఇది ఓటీటీ బాట ప‌ట్టింది. కంటెంట్‌ పరంగా బాగున్నా కలెక్షన్ల పరంగా నిరాశపరచిన ‘వైల్డ్‌ డాగ్’‌ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మ దులుపుతోంది. వ్యూస్‌ పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తూ దూసుకుపోతోంది.

నివేదికల ప్రకారం.. ‘వైల్డ్ డాగ్’ కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోవడం ద్వారా అన్ని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించ‌డం విశేషం. పాన్ ఇండియా రేంజ్‌ నిర్మాణ విలువలు, కథను నడిపిన తీరు, నాగార్జున నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలువడంతో ఇతర భాషలలో కూడా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు వర్షన్‌లో ఈ చిత్రం వ్యూస్‌ పరంగా 2 స్థానంలో ఉండగా, తమిళ వెర్షన్‌కుగానూ 5వ స్థానం దక్కింది. విడుదలై వారం కూడా కాలేదు కాబట్టి ఇంకా వ్యూస్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చెప్పాలంటే నాగార్జున‌కు తమిళనాట పెద్దగా మార్కెట్‌ లేదు. కానీ, అక్కడి లోకల్‌ హీరోల సినిమాలను వెన‌క్కు నెట్టి మ‌రీ ఓ రేంజ్‌లో వ్యూస్‌ సొంతం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రానికి ఒటీటీలో ఎంతటి రెస్పాన్స్‌ వస్తోందో. ఇక ఇతర భాషల్లో కూడా మంచి స్పందనతో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటోంది.‌ 

టాలీవుడ్‌లో కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అలాగే తన కెరీర్‌లో ఒకే రకం జోనర్‌ సినిమాలను కాక భిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే రొమాంటిక్‌, ఫ్యామిలీ కథల నుంచి ప్రస్తుతం యాక్షన్‌ నేఫథ్యంలోని కథలను ఎంచుకుంటున్నాడు. అలా చేసిన సినిమానే ‘వైల్డ్ డాగ్’. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సాల్మ‌న్‌‌ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో నాలుగు భాషల్లో అంటే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. 

( చదవండి: ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్)

మరిన్ని వార్తలు