In The Name Of God: ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌... వెబ్‌ సిరీస్‌ ఇలాగా?

21 Jun, 2021 11:21 IST|Sakshi

రివ్యూ టైమ్‌.. ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’

వెబ్‌ సిరీస్‌: ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’;
తారాగణం: ప్రియదర్శి, నందినీ రాయ్‌;
మాటలు: ప్రదీప్‌ ఆచార్య;
కాన్సెప్ట్‌: ఆదిత్యా ముత్తుకుమార్‌;
రచన, దర్శకత్వం: విద్యాసాగర్‌ ముత్తుకుమార్‌;
ఓటీటీ: ఆహా

‘బాషా’, ‘మాస్టర్‌’ లాంటి సూపర్‌ హిట్స్‌ అందించిన దర్శకుడు సురేశ్‌ కృష్ణ తెలుగులో నిర్మించిన తొలి వెబ్‌సిరీస్‌ ఇది. ట్రైలర్‌ దశ నుంచి ఆసక్తి రేపింది. క్రైమ్‌ అండ్‌ సెక్స్‌ కలగలిపి కథ రాసుకోవడం డిజిటల్‌ కంటెంట్‌కు పేయింగ్‌ ఎలిమెంటే. కానీ, అవి ఉంటే సరిపోతుందా? అసలు కథ, కథనం గాడి తప్పితే? ఏ పాత్రా, ఏ సంఘటనా మనసుకు హత్తుకోకపోతే? సెన్సార్‌ లేని వెబ్‌ సిరీస్‌ కదా అని విశృంఖలంగా తీయాలనుకుంటే? ఇవేమంత జవాబు చెప్పలేని బేతాళ ప్రశ్నలు కాదు. 


కథేమిటంటే..: మనిషిలో ఉండే సహజమైన మోహం, దురాశ, కామం, పశుప్రవృత్తి లాంటి గుణాలతో అల్లుకున్న కథ ఇది. రాజమండ్రిలో ట్రావెల్స్‌ డ్రైవర్‌గా పనిచేసే ఆది (ప్రియదర్శి)కి ఓ రిసార్ట్‌ కొనుక్కోవాలని ఆశ. బూతు ‘బిట్‌ సినిమాలు’ తీసే అయ్యప్ప (పోసాని). ఆ దర్శకుడు కట్టుకున్న పడుచు పెళ్ళాం మీనా (నందినీరాయ్‌) వైపు ఆది ఆకర్షితుడవుతాడు. గంజాయి అమ్ముతూ తప్పుదోవ పట్టిన థామస్‌(వికాస్‌)తో సంబంధం పెట్టుకున్న మీనా అనుకోని పరిస్థితుల్లో భర్తనే చంపేస్తుంది. అప్పటికే ఓ దాదా ఇచ్చిన హవాలా సొమ్ము తమ్ముడి ద్వారా అయ్యప్పకు చేరి ఉంటుంది. ఇటు అయ్యప్ప హంతకుల కోసం అన్వేషణ. అటు ఆ 5 కోట్ల హవాలా మనీ ఏమైందని దాదాల వెతుకులాట. మీనా మోజులో పడి, అయ్యప్ప హత్యోదంతంలో ఇరుక్కున్న హీరో. అతని చుట్టూ రోసీ (మహమ్మద్‌ అలీ బేగ్‌) పాత్రలు. హీరో ఈ సమస్యల నుంచి బయటపడ్డాడా? డబ్బు సూట్‌కేసేమైంది లాంటి వాటికి జవాబు కోసం 7 భాగాలు చూడాలి.

ఎలా చేశారంటే..: తెలంగాణ యాక్టర్‌గా ముద్రపడ్డ ప్రియదర్శి రాజమండ్రి నేపథ్యంలో మొదలై, అక్కడే ఎక్కువగా జరిగే ఈ కథలో కోస్తాంధ్ర యాసతో వినిపించారు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించారు. నందినీ రాయ్‌ బోల్డ్‌గా చేశారు. పోసాని కనిపించేది ఒక్క ఎపిసోడ్‌లోనే! ఆ పాత్రలో, ఆ రకమైన సంభాషణల్లో ఒదిగిపోయారు. రోసీగా రంగస్థల నటుడు మహమ్మద్‌ అలీ బేగ్‌ చేసిందీ, చేయగలిగిందీ లేవు. అలాగే, ఫకీర్‌ దాదా (ఉమా మహేశ్వరరావు), హత్యకు గురైన దర్శకుడి తమ్ముడు విష్ణు (చంద్రకాంత్‌) – ఇలా చాలా పాత్రలు తెరపై వస్తుంటాయి. ఆ పాత్రలు, నటీనటులు విగ్రహపుష్టితో ఉన్నా కథలోని కన్‌ఫ్యూజన్‌ ఆ పాత్రల్లో, పాత్రధారణలో ఉంది. 

ఎలా తీశారంటే..: తొలుత టెక్నికల్‌ ఫాల్ట్‌తో 5 భాగాలే అప్‌లోడ్‌ అయి, ఆనక ఆలస్యంగా మొత్తం 7 భాగాలూ నెట్‌లో కనిపించిన సిరీస్‌ ఇది. అన్ని భాగాల్లోనూ ఒకటి రెండు శృంగార సన్నివేశాలు, బూతులు, హింస, హత్యాకాండ తప్పనిసరి. ప్రతి పాత్ర నోటా అదుపు లేని అసభ్య భాష. వెబ్‌ సిరీస్‌ అంటే ఇలాగే రాయాలని రచయిత ఫిక్సయినట్టున్నారు. పొడి పొడి డైలాగ్స్, అర్థం లేని పాత్రల ప్రవర్తన ఈ సిరీస్‌కు దెబ్బ. 

ఒకట్రెండు భాగాల తరువాత కథ, కథనం గాడి తప్పేశాయి. దానికి తోడు నిర్ణీతమైన లక్ష్యం, లక్షణం లేని బోలెడన్ని పాత్రలు వచ్చి పడుతుంటాయి. అందుకే, మూడో ఎపిసోడ్‌ నుంచి బోరెత్తించి, ఆపైన ఈ వెబ్‌ సిరీస్‌ ఎటెటో వెళ్ళిపోతుంది. అటు హత్య మీద కానీ, ఇటు డబ్బున్న సూట్‌కేస్‌ మీద కానీ దృష్టి లేకుండా పోయింది. ఆ బరువంతా ఆఖరి ఎపిసోడ్‌ మీద పడి, కథను హడావిడిగా ముగించాల్సి వచ్చింది.

గతంలో ‘లూజర్‌’ వెబ్‌ సిరీస్‌లో చేసిన ప్రియదర్శికి ఇది కొత్త కోణం. కామం, కోపం, భయం అన్నీ పలికించారు. ఆయనే ఈ సిరీస్‌కు రిలీఫ్‌. కానీ కథలోని లోటుపాట్లు ఆ పాత్రనూ కిందకు గుంజేశాయి. నిర్మాణ విలువలు, కెమేరా వర్క్‌ బాగున్నాయి. వాటికి తగ్గట్టు స్క్రిప్టులోనూ, ఫైనల్‌ ప్రొడక్ట్‌లోనూ ఎడిటింగూ ఉండాల్సింది. ఇది కచ్చితంగా 18 ఏళ్ళు పైబడిన వాళ్ళే చూడాల్సిన సెక్సువల్, క్రైమ్‌ సిరీస్‌. ఓటీటీ వచ్చి జనం అభిరుచిని మార్చినమాట నిజమే కానీ, బోల్డ్‌గా చెప్పడం, చూపించడం అనే ఒక్కదాని మీదే ఆధారపడి వెబ్‌ సిరీసులు తీస్తే కష్టం. ఆ సంగతి ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ గుర్తు చేస్తుంది. 

ఈ మధ్య ‘లెవన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్, ‘అర్ధ శతాబ్దం’ లాంటివి ‘ఆహా’లో నిరాశపరిచాయి. ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ ఆ కోవలోనే చేరడం ఓ విషాదం. మొత్తం చూశాక ఇంతకూ ఏం చెప్పదలుచుకున్నారో తేల్చిచెప్పడం కష్టమే. ‘సైతాను నీ లోని కోరికను రెచ్చగొట్టి, నువ్వు తప్పు చేసేలా చేసి, కష్టపడుతుంటే చూసి ఆనందిస్తాడు. కానీ, దేవుడు తప్పు చేసినప్పుడే క్షణంలో శిక్షిస్తాడు’ అని హీరో అంటాడు. కానీ, దర్శకుడి అనుభవ రాహిత్యంతో... ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌... కథ అతి నిదానంగా నాలుగున్నర గంటలు సాగి, చూస్తున్న ప్రతి క్షణం శిక్షిస్తుంది. 

బలాలు: ∙భిన్నమైన పాత్రలో ప్రియదర్శి నటన
కెమేరా వర్క్‌
నిర్మాణ విలువలు

బలహీనతలు: రచనా లోపం, స్లో నేరేషన్‌
కథకూ, పాత్రలకూ తీరూతెన్నూ లోపించడం
మితిమీరిన సెక్స్, వయొలెన్స్‌ కంటెంట్‌ 

కొసమెరుపు: సీరియల్‌ కన్నా స్లో... సిరీస్‌!
రెంటాల జయదేవ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు