ఇలాంటి మాటలు మాట్లాడితే సహించం

21 Nov, 2021 03:13 IST|Sakshi

ఖబడ్దార్‌.. భరతం పడతాం

రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదు

ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకుని కూర్చోం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కుటుంబంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. తామెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని, తమ సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగోలేదని అన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రజలు, పార్టీ, తన అభిమానుల తరఫున హెచ్చరిక చేస్తున్నానని, మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదని, ఖబడ్దార్, భరతం పడతామని అన్నారు.

శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత ఎజెండాను తీసుకు వచ్చారని అన్నారు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు సాధారణమేనని, అయితే కుటుంబ సభ్యులపై దాడి చేయడం సరైంది కాదని చెప్పారు. చాలా ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటితడి పెట్టుకోవడం ఎప్పుడూ లేదని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి చేయడం సరైంది కాదని, ఆడవాళ్ల జోలికిస్తే చేతులు ముడుచుకుని కూర్చునేది లేదని హెచ్చరించారు.

చంద్రబాబుపై దాడులకు యత్నించినా సమన్వయంతో ఉన్నామని, ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదని చెప్పారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నందమూరి రామకృష్ణ, భువనేశ్వరి సోదరి లోకేశ్వరి, హరికృష్ణ కుమార్తె సుహాసిని, ఎన్టీఆర్‌ కోడలు వసుంధర, నందమూరి శ్రీమంతిని, చైతన్యకృష్ణ, నారా రోహిత్‌ తదితరులు కూడా మాట్లాడారు. 

వ్యక్తిగత విమర్శలు సరికాదు: జూనియర్‌ ఎన్టీఆర్‌
ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో జరిగిన ఘటన తనను కలచివేసిందని ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సాధారణమని, అవి ప్రజా సమస్యలపై జరగాలే తప్ప వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డలను గౌరవించే సంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందివ్వాలని ఒక తండ్రిగా, ఒక కొడుకుగా చెబుతున్నానని అన్నారు.  

మరిన్ని వార్తలు