తప్పుడు ప్రచారం జరుగుతోంది

6 Aug, 2023 04:11 IST|Sakshi

– ప్రతాని రామకృష్ణ గౌడ్‌

‘‘తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ (టీఎఫ్‌సీసీ) చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరులో దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్‌ ఫంక్షన్‌కు, తమకు సంబంధం లేదని, టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదని తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయంపై శనివారం టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ స్పందిస్తూ– ‘‘మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.

సౌత్‌ ఇండియాలోని ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వనున్నాం. దీన్ని కాదనే హక్కు దామోదర ప్రసాద్, సునీల్‌ నారంగ్‌లకు లేదు. ‘టీఎఫ్‌సీసీ’ పేరుతో ట్రేడ్‌ మార్క్, టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాం. టీఎఫ్‌సీసీ నంది ఈవెంట్స్‌ పేరుతో దుబాయ్‌ ప్రభుత్వం నుండి లైసెన్స్‌ తీసుకున్నాం. సెప్టెంబర్‌ 28న దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుక జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం టీఎఫ్‌సీసీ నంది అవార్డులకు అనుమతితో కూడిన లెటర్‌ కూడా ఇచ్చింది’’ అన్నారు.

మరిన్ని వార్తలు