దర్శకుడికి రూ.7 లక్షల ఆస్పత్రి బిల్లు: హీరోలు ముందుకొస్తారా?

6 May, 2021 07:18 IST|Sakshi

'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో ప్రయాణం మొదలు పెట్టాడు నంద్యాల రవి. ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత విజయ్‌ కుమార్‌ కొండా తీసిన 'ఒరేయ్‌ బుజ్జిగా'తో రచయితగా మారాడు. ఈ మధ్యే వచ్చిన 'పవర్‌ ప్లే'కు సైతం స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేశాడు. ఇదిలా వుంటే తాజాగా ఈ రచయిత కరోనా బారిన పడినట్లు సమాచారం. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే అతడికి అందించిన వైద్యానికిగానూ ఆస్పత్రి రూ.7 లక్షల బిల్లు వేసిందట. ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా చెల్లించేది? అని రవి కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారట. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారట. ఒక్కో సినిమాకు కోట్లు తీసుకునే టాలీవుడ్‌ హీరోలు తలా రూ.50 వేలు ఇస్తే అతడిని ఆదుకున్నవారవుతారని పలువురూ అభిప్రాయపడుతున్నారు. లేదంటే సీసీసీ (కరోనా సంక్షోభ సహాయ నిధి) సాయం చేయాలని భావిస్తున్నారు.

టాలీవుడ్‌లో ఇలా కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఎంతో మంది ఉన్నారని, వారికి సాయం చేసేందుకు టాలీవుడ్‌ సెలబ్రిటీలు ముందుకు వచ్చి గొప్ప మనసు చాటుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

చదవండి: అన్ని వుడ్స్‌ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు

మరిన్ని వార్తలు