మ..మ..మాస్ అంటున్న యంగ్‌ హీరోలు

12 Feb, 2023 11:43 IST|Sakshi

చిత్రపరిశ్రమలో మాస్‌ అండ్‌ యాక్షన్‌ సినిమాలకు, ఆ హీరోలకు ఉండే క్రేజే వేరు. మాస్‌ హీరోల సినిమాలు విడుదలయితే థియేటర్స్‌లో దద్దరిల్లిపోవాల్సిందే. క్లాస్‌ మూవీస్‌ ఎన్ని చేసినా రాని ఇమేజ్‌ ఒక్క మాస్‌ మూవీతో వస్తుంది. ఆ హీరో మార్కెట్‌తో పాటు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా డబుల్‌ అయిపోతుంది. అందుకే ఏ హీరో అయినా మాస్‌ హీరో అనిపించుకోవడానికే ట్రై చేస్తాడు. ఇప్పుడు మన టాటీవుడ్‌ యంగ్‌ హీరోలంతా మాస్‌ ఇమేజ్‌పై ఫోకస్‌ చేశారు. ఊరమాస్‌ కథలను ఎంచుకుంటూ క్లాస్‌ నుంచి మాస్‌కు షిఫ్ట్‌ అవుతున్నారు.

వీరిలో నేచురల్‌ స్టార్‌ నాని ముందు వరుసలో ఉన్నాడు. అష్టాచమ్మా నుంచి అంటే సుందరానికి.. వరకు నాని చేసిన సినిమాలన్ని క్లాస్‌ కథలకు సంబంధించినవే. ఇప్పటి వరకు నాని ఫుల్‌ లెన్త్‌ మాస్‌ క్యారెక్టర్‌ చేయలేదు. కృష్ణార్జున యుద్దంలో మాస్‌ గెటప్‌లో కనిపించినా.. అది వర్కౌట్‌ కాలేదు. ఈ సారి నాని తన రూటుని మార్చాడు. ప్రేక్షకులకు తనలోని ఊరమాస్‌ని పరిచయం చేసేందుకు ‘దసరా’తో రాబోతున్నాడు.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌లో నాని గెటప్‌ అదిరిపోయింది. తెలంగాణ భాషలో నాని చెప్పిన డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్టయితే నాని మాస్‌ సినిమాల కౌంట్‌ పెంచే చాన్స్‌ ఎక్కువగా ఉంది. 

మరోవైపు కేరీర్‌ స్టార్టింగ్‌లో మాస్‌ హీరో అనిపించుకున్న రామ్‌ పోతినేని.. మధ్యలో క్లాస్‌కి షిఫ్ట్‌ అయ్యాడు. ఆయన హీరోగా తెరకెక్కిన క్లాస్‌ చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించలేకపోయాయి. దీంతో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మళ్లీ మాస్‌కి షిఫ్ట్‌ అయ్యాడు. ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్టయింది. ఆ తర్వాత వరుసగా రెడ్‌, ది వారియర్‌ అనే మాస్‌ సినిమాలు చేశాడు. అవేవి వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ సారి మాస్‌లో మాస్టర్స్‌ చేసిన బోయపాటితో రామ్‌ జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో ఓ మాస్‌ మూవీ తెరకెక్కుతుంది. 

ఇక హీరో నితిన్‌ కూడా మాస్‌ సినిమాలవైపే మొగ్గు చూపుతున్నాడు. మాచర్ల నియోజకవర్గం సినిమాతో మాస్‌ ఫ్లేవర్‌ చూపించిన నితిన్‌.. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో కంప్లీట్‌ మాస్‌ ఫిల్మ్‌ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా పిరియాడికల్‌ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోయే సినిమా కూడా పక్కా మాస్‌ మూవీ అనే మాట ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. 

అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్‌ కూడా మాస్‌ ఇమేజ్‌ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఏజెంట్‌ అనే స్పై థ్రిల్లర్‌తో అఖిల్‌.. ‘కస్టడీ’తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు