Nani On Ante Sundaraniki Movie: అప్పుడు నజ్రియా ఎగిరి గంతేసింది: నాని

6 Jun, 2022 15:56 IST|Sakshi

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ద్వారా నజ్రియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా హీరో నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

వివేక్‌ ఆత్రేయతో మీ జర్నీ ఎలా ఉంది?
కొత్త డైరెక్టర్లతో లేదా ఒకటి రెండు సినిమాలు తీసిన దర్శకులతో ఎందుకు సినిమాలు చేస్తావని అందరూ నన్ను అడుగుతుంటారు. ప్రజెంట్‌ లీడింగ్‌లో ఉన్న దర్శకుల కంటే.. ఫ్యూచర్‌లో లీడింగ్‌ డైరెక్టర్‌తో పని చేస్తే.. అప్పుడు మనం వాళ్ల జర్నీలో కూడా పాలు పంచుకోవచ్చు అనే చిన్న స్వార్థం నాకు ఉంటుంది. వివేక్‌తో మాట్లాడినా.. ఆయన సినిమాలు చూసినా... భవిష్యత్తులో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటాడనిపించింది. అందుకే ఆయనతో సినిమా కమిట్‌ అయ్యాను. 

కొత్త దర్శకులు చెప్పిన కథను తీస్తారో లేదో తెలియదు.. మీరు మాత్రం అలాంటి వాళ్లను ఎలా నమ్ముతారు? 
అది నమ్మకం అంతే. మొదట్లో చాలా మంది నన్ను నమ్మి సినిమాలు తీశారు. ఇప్పుడు నాకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకున్నా. అందుకే.. టాలెంట్‌ ఉన్నవాళ్లకి నేను అవకాశం ఇవ్వాలనుకుంటాను.

అంటే..సుందరానికిలో కొత్తగా ఏం చూపిస్తున్నారు?
నేను ఇంతకు ముందు తీసిన ఫన్‌ జానర్‌ సినిమాల్లో ఎలాంటి కామెడీ చేశానో.. దానికి చాలా భిన్నంగా ఇందులో చేస్తాను. డైలాగ్స్‌ కానీ, పాత్ర ప్రవర్తన కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. తెరపై కొత్త నానిని చూస్తారు. 

ఫస్ట్‌ టైం బ్రాహ్మణ కుర్రాడి పాత్రని చేశారు కదా? ఏమైనా హోం వర్క్‌ చేశారా?
లేదు. మన సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఉన్నప్పుడు.. ఉన్నదాని కంటే కాస్త ఎక్కువ చూపిస్తాం. వాళ్ల మాటలను కూడా ఢిపరెంట్‌గా చూపించి కామెడీ పండిస్తాం. కానీ ఇందులో ఎవరినైనా సరే కించపరిచి కామెడీ చేసిన సీన్స్‌ ఉండవు. వివేక్‌ ఆత్రేయ ఓ బ్రాహ్మణ కుర్రాడు. వాళ్ల ఇంట్లో అమ్మ, నాన్న ఎలా ఉంటారు, వాళ్ల ఆచారాలు ఏంటి? ఎలా ప్రవర్తిస్తారు ..ఇలాంటి విషయాలను చాలా చక్కగా చూపించాడు.

ఇందులో మీరు అమాయకుడైన సుందరం పాత్రని పోషించారు. ఆ పాత్ర గురించి?
ట్రైలర్‌ చూసి సుందరం చాలా ఇన్నోసెంట్‌, వాళ్ల నాన్న చేతిలో నలిగిపోతున్నాడు అనిపించొచ్చు కానీ.. వాడు చాలా వరస్ట్‌ ఫెల్లో(నవ్వుతూ..). వివేక్‌ కూడా నాకు కథ చెప్పినప్పుడు అదే చెప్పాడు. ‘వీడు వరస్ట్‌ ఫెలో సర్‌. కానీ ప్రతి ఫ్రేమ్‌లో వీడిని ప్రేమించాలి’ అని అన్నాడు. అలా చేయడం పెద్ద టాస్క్‌ మాకు. ఔట్‌పుట్‌ చాలా చక్కగా వచ్చింది.

నరేశ్‌తో బాండింగ్‌?
ఇంతకు ముందు నరేశ్‌తో నేను చేసిన ఏ సినిమాలు కూడా.. అంటే సుందరానికి.. దరిదాపుల్లో ఉండవు. మా ఇద్దరి కాంబినేషన్‌ ఈ చిత్రంలో వేరే లెవల్‌కు వెళ్లిపోతుంది.

కులాంతర వివాహాలపై చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్తగా ఏం చూపించారు?
ఇందులో రెండు కొత్త విషయాలు ఉంటాయి. ఒకటి ట్రైలర్‌లో చెప్పేశాం. రెండోది థియేటర్స్‌లో చూడాల్సిందే. 

రియల్‌ లైఫ్‌లో కూడా మీది ప్రేమ వివాహం. ఈ సినిమాలో మీ రియల్‌ లైఫ్‌ సన్నివేశాలు ఉన్నాయా?
నా పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని మా పెళ్లి చేశారు. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే.. అమ్మాయి వాళ్లదేమో సైంటిస్ట్‌ ఫ్యామిలీ.. నేనేమో సినిమాలు అంటూ పిచ్చోడిలా తిరుగుతున్నా. ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు నాకు ఇవ్వొచ్చా లేదా అని అమ్మాయి ఫ్యామిలీ టెన్షన్‌ పడింది. నన్ను కలిశాక ఒప్పుకొని హ్యాపీగా పెళ్లి చేశారు. 

ఈ చిత్రంలోకి నజ్రియా ఎలా వచ్చింది?
నేను, వివేక్‌ అనుకొనే నజ్రియాను తీసుకొచ్చాం. ఈ కథలో హీరోహీరోయిన్‌ ఇద్దరికీ ప్రాధాన్యత ఉంటుంది. లీలా పాత్రకు ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన ప్రతిసారి మేమిద్దరం.. నజ్రియాలాగే ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం. నజ్రియాలాగా ఎందుకు ఆమెనే తీసుకుంటే బాగుంటుంది కదా అనుకొని కథ వినిపించాం. పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తేనే ఒప్పుకోని నజ్రియా.. ఈ కథ విన్నవెంటనే ఎగిరి గంతేసి.. చేసేద్దాం అని చెప్పారు.  కథను బాగా నమ్మితే తప్ప నజ్రియా ఒప్పుకోదు. 

‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదల టైంలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని మాట్లాడారు. ఇప్పుడేమో ఫిల్మ్‌ మేకర్సే టికెట్ల రేట్లను తగ్గిస్తున్నారు. అంటే సుందరానికి ఎలా ఉండబోతుంది?
సోషల్‌ మీడియాలో ఇలాంటి కామెంట్లు చూశాను. అసలు నేను ఏ సందర్భంలో రేట్ల గురించి మాట్లాడాను? టికెట్ల రేట్లు రూ.30, రూ.40 ఉన్నప్పుడు నేను అలా అన్నాను. కనీసం రూ.100, రూ.120 లేకుంటే ఎలా అని అడిగాను. ఇప్పుడు రూ. 500 అయితే.. చూశావా మీ కోసం 500 పెంచాలా? అంటున్నారు. ఎవరు పెంచమన్నారు? ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి పెద్ద సినిమాలకు పెంచితే తప్పులేదు కానీ.. అన్ని సినిమాలకు అదే స్థాయిలో పెంచితే అది చాలా పెద్ద తప్పు. కనీస ధరలు ఉంటే చాలు. 

టీజర్‌లో మీ లుక్ బారిష్టర్ పార్వతీశం ని గుర్తిచేసింది.. ఇందులో ఆ నవల ప్రేరణ ఉందా ? 
ఆ నవలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. పంచె కట్టే సమయంలోనే బారిష్టర్‌ పార్వతీశం గుర్తొస్తుంది. అప్పుడే ఎందుకు అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. 

‘శ్యామ్‌ సింగరాయ్‌’ది సీరియస్‌ సబ్జెక్‌..ఇది కామెడీ జానర్‌. మీకు కొంచె రిలీఫ్‌ అనిపించిందా?
సబ్జెక్ట్‌ సీరియస్‌ అయినా.. కామెడీ అయినా షూటింగ్‌లో పడే కష్టాలు పడాల్సిందే. సీన్‌ బాగా రావాలనే తపన, ఒత్తిడి ఎప్పటికీ ఉంటుంది. అయితే సీరియస్‌ చిత్రాల్లో ఫైటింగ్‌లు, ఎగరడాలు, దూకడాలు ఉంటాయి. కామెడీ మూవీస్‌లో అలాంటివి ఉండవు అంతే. 

సౌత్‌ సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో బాగా ఆడుతున్నాయి. మరోపక్క బాలీవుడ్‌ స్ట్రగుల్‌ అవుతుంది. ఈ ఫేజ్‌ని ఎలా చూస్తారు?
ఇది సినిమాకే గోల్డెన్‌ ఫేజ్‌. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అని కాదు.. ఇండియా వైజ్‌గా సినిమాకు ఇది మంచి ఫేజ్‌.

వంశీ పైడిపల్లి, విజయ్‌ మూవీలో మీరు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తునాయి?
రోజుకో కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మహేశ్‌తో మూవీ, ప్రశాంత్‌ నీల్‌తో పాన్‌ ఇండియా చిత్రం అంటూ.. రూమర్స్‌ వస్తున్నాయి. రేపు నేను నిజంగానే ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేస్తే అది కూడా పుకారే అనుకుంటారేమో(నవ్వుతూ..)

మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ గురించి?
టాలీవుడ్‌లో లీడింగ్‌ ప్రొడెక్షన్‌ హౌస్‌గా మైత్రీ మూవీ మేకర్స్‌ మారింది. గొప్ప గొప్ప నిర్మాతలు ఉన్నారు కానీ.. వీళ్లంత బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు తీసేవాళ్లు లేరు. గ్యాంగ్‌ లీడర్‌తో వీళ్లతో సినిమా చేసే అవకాశం కలిసింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి సినిమాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ.

దసరా సినిమా ఎంత వరకు వచ్చింది?
25 శాతం షూటింగ్‌ పూర్తయింది. 

ఇది కామెడీ మూవీ.ఇందులో మతాలకు సంబంధించిన పాయింట్‌ని టచ్‌ చేసినప్పుడు కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది కదా? 
అస్సలు లేదు. రియల్‌ లైఫ్‌లో లేనివి చూపిస్తే.. కాంట్రవర్సీ అవుతుంది. కానీ రియల్‌ లైఫ్‌లో మన ఫ్యామిలీలాగే ఉన్నది ఉన్నట్లుగా,.. వాళ్లలోని మంచితనాన్ని బయటకు చూపిస్తే మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? సెలబ్రేట్‌ చేసుకుంటారే తప్ప.. ఎక్కడా హర్ట్‌ కారు. 

వివేక్‌ సాగర్‌ సంగీతం గురించి?
వివేక్‌ సాగర్‌ కథకు ఒక ఆయుధంలాంటి వాడు. ఆయన పాటలు విన్నవెంటనే.. సంగీత్‌ ఫంక్షన్‌లో పెట్టి డ్యాన్స్‌ వేయాలనిపించవు. కానీ కథను ఎంత ఇంపాక్ట్‌పుల్‌గా చెప్పాలో..అంత చూపిస్తాడు. ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడినా అతియోశక్తిగా అనిపిస్తుంది. సినిమా విడుదల తర్వాత మాట్లాడుతాను.

పాన్‌ ఇండియా సినిమాలు పెరుగుతున్నాయి. మీరు కూడా అలాంటి చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
నా ఉద్దేశంలో పాన్‌ ఇండియా సినిమా అంటే.. మనం చెప్పుకోవడం కాదు..ప్రేక్షకులు చెబితేనే అది పాన్‌ ఇండియా చిత్రం. మంచి కథ తీస్తే చాలు.. అది పాన్‌ ఇండియా చిత్రమే. అందుకు పుష్ప చిత్రమే నిదర్శనం. ఒక సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తే అది పాన్‌ ఇండియా చిత్రం. అంతేకాని మనం పోస్టర్‌ మీద వేసుకున్నంత మాత్రాన అది పాన్‌ ఇండియా చిత్రం కాదు. 

ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో.. అది నేను చేస్తే బాగుండు అని అనిపించిన చిత్రం ఏదైనా ఉందా?
జై భీమ్‌ సినిమా చూసినప్పుడు.. ఇలాంటి కథ తెలుగులో వస్తే బాగుంటుంది అనిపించింది. అలాంటి కథ ఏ హీరోకి వచ్చినా ఓకే.. నాకు వస్తే ఇంకా హ్యాపీ

మీ నిర్మాణ సంస్థలో వచ్చే సినిమాలు?
మీట్‌ క్యూట్‌, హిట్‌ 2 చిత్రాలు రాబోతున్నాయి. 

మరిన్ని వార్తలు