Narappa Movie Review: వెంకటేశ్‌ ‘నారప్ప’ మూవీ ఎలా ఉందంటే..

20 Jul, 2021 03:00 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : నారప్ప
జానర్ : యాక్షన్‌ డ్రామా
నటీనటులు : వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, నాజర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు
నిర్మాణ సంస్థ :  సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వీ క్రియేషన్స్
నిర్మాతలు :  సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను
కథ: వెట్రిమారన్‌
దర్శకత్వం : శ్రీకాంత్‌ అడ్డాల
సంగీతం :  మణిశర్మ
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు
ఎడిటర్‌ : మార్తాండ్ కె. వెంకటేష్‌
విడుదల తేది : జూలై(20), 2021(అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)
Narappa Telugu Movie Review
టాలీవుడ్‌లో రీమేక్‌ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే హీరో విక్టరీ వెంకటేశ్‌. ఒక విధంగా చెప్పాలంటే ఇతర భాషల్లో ఒక సినిమా హిట్‌ అయిందంటే.. ఆ మూవీని వెంకీమామ తెలుగులో రీమేక్‌ చేస్తారా? అనే చర్చలు మొదలవుతాయి. వెంకటేశ్‌ నేరుగా చేసిన సినిమాలకు సమానంగా రీమేక్‌ మూవీలు చేశాడని చెప్పొచ్చు. అపజయాలతో కెరీర్‌ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఆయన్ని నిలబెట్టింది కూడా రీమేక్‌లే కావడం విశేషం. అయితే.. ఇతర భాషల్లో హిట్టైన ప్రతి సినిమాను వెంకీ రీమేక్‌ చేయడు. తనకు సూట్‌ అయ్యే కథలనే ఎంచుకుంటాడు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మాతృక సినిమాను మర్చిపోయేలా చేస్తాడు. అదే వెంకీ మామ స్టైల్‌. ఆయన తాజాగా రీమేక్‌ చేసిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్‌’కి రీమేక్‌ ఇది.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ఈ ఏడాది మే 14న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో మంగళవారం(జూలై 20) ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘నారప్ప’ ఏ మేరకు అందుకున్నాడు? ధనుష్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిన ‘అసురన్‌’ రీమేక్‌ వెంకీకి  ప్లస్సా.. మైనస్సా? రివ్యూలో చూద్దాం.
Narappa Movie Review
కథ
అనంతపురం జిల్లా రామసాగరం గ్రామానికి చెందిన నారప్ప(వెంకటేశ్‌) కుటుంబానికి, పక్కగ్రామం సిరిపికి చెందిన భూస్వామి పండుస్వామికి భూ తగాదా చోటుచేసుకుంటుంది. నారప్పకు చెందిన మూడు ఎకరాల భూమిని బలవంతంగా కొనేందుకు ప్రయత్నిస్తాడు పండుస్వామి. అతని ప్రయత్నాలను తిప్పికొడతాడు నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా(కార్తీక్‌ రత్నం). పండుస్వామి మనుషులతో బహిరంగంగానే గొడవకు దిగుతాడు. అంతేకాదు ఒక సందర్భంలో పండుస్వామిని చెప్పుతో కొట్టి అవమానిస్తాడు. దీంతో పగ పెంచుకున్న పండుస్వామి.. తన మనుషులతో మునిఖన్నాని హత్య చేయిస్తాడు.
Narappa Review
అయినా కూడా నారప్ప ఎదురుతిరగడు. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడాన్ని నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) జీర్ణించుకోలేకపోతుంది. నిత్యం కొడుకుని తలుచుకుంటూ బాధ పడుతుంది. తల్లి బాధ చూడలేక నారప్ప రెండో కుమారుడు సిన్నప్ప(రాఖీ) పండుస్వామిని చంపేస్తాడు. దీంతో సిన్నప్ప ప్రాణాలను కాపాడేందుకు నారప్ప కుటుంబం గ్రామాన్ని వదిలివెళ్తుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలేంటి? తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప ఏం చేశాడు? పెద్ద కొడుకు హత్యకు గురైనా నారప్ప ఎందుకు సహనంగా ఉన్నాడు? అసలు నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన రెండో కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. 
Venkatesh Narappa Review

నటీనటులు
ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే వెంకీ.. ‘నారప్ప’గా అదరగొట్టేశాడు. ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా అద్భుతంగా నటించాడు. వెంకీ డైలాగులు, స్టైల్‌, మేన‌రిజ‌మ్‌, లుక్స్ అన్నీఈ చిత్రానికి మేజర్‌ హైలైట్‌ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో వెంకటేశ్‌ కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా కుమారుడు చనిపోయిన సీన్‌, గ్రామ ప్రజల కాళ్లు మొక్కిన సీన్లలో జీవించేశాడు.  నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది.  తమిళంలో మంజు వారియర్‌ చేసిన పాత్ర ఆమెది. నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్‌ రత్నం మెప్పించాడు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా తనదైన ముద్ర వేశాడు. లాయర్‌ పాత్రలో రావు రమేశ్‌, బసవయ్య పాత్రలో రాజీవ్‌ కనకాల ఎప్పటిమాదిరే జీవించేశారు. అమ్ము అభిరామి, నాజర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. 

విశ్లేషణ
వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ తెలుగు రీమేకే ‘నారప్ప’. అయితే ఒక భాషలో హిట్‌ అయిన చిత్రం.. ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సర్వసాధారణం. మూలకథని తీసుకొని మన నేటివిటీకి తగ్గట్లు మార్చి రీమేక్ చేస్తారు. నారప్ప విషయంలో అలాంటి ప్రయోగాల వైపు వెళ్లలేదు. కాస్టింగ్ మినహా యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్‌తో సహా అసురన్ సినిమా నుంచి అంతా కాపీ పేస్ట్ చేసినవే. కథలోని పాత్రలను ఏమాత్రం మార్చకుండా ఎమోషన్స్‌ పండించడంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల కొంతమేర సఫలం అయ్యాడు. ఒకప్పుడు నిమ్న-అగ్ర వర్ణాల మధ్య ఉన్న భేదాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు.
How is Narappa Movie

‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ లాంటి డైలాగ్‌తో సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇక మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది.  అసలు అసురన్‌తో పోల్చకుండా ఒక కొత్త కథగా చూస్తే మాత్రం నారప్ప తప్పకుండా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించే సినిమానే.  అయితే ఓటీటీల పుణ్యమాని అసురన్ మూవీని చాలా మందే చూశారు. సో నారప్పని అసురన్‌తో తప్పకుండా పోల్చి చూస్తారు. మొదటిసారి చూసే ప్రేక్షకులను మాత్రం ‘నారప్ప’ పక్కా థ్రిల్‌ చేస్తాడు. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు