Vijaya Nirmala: ఆమెకు బంగారు పాదాలు చేయించిన నరేశ్‌

27 Jun, 2021 10:22 IST|Sakshi

దర్శకురాలు, నటి విజయ నిర్మల వర్ధంతి

‘జయ కృష్ణా ముకుందా మురారీ’ చిన్ని కృష్ణుడుగా వెండితెర మీద వేణువు వాయించారు... ‘వస్తాడు నా రాజు ఈ రోజు’ అందమైన కొత్త పెళ్లికూతురిగా అలరించారు.. ‘పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ’ పార్వతిగా కంటనీరు పెట్టించారు.. ‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా’ సూపర్‌స్టార్‌ కృష్ణ చేయి అందుకున్నారు.. విజయనిర్మల కుమారుడు విజయకృష్ణ నరేశ్‌ కుమార్‌ తల్లి గురించి చెప్పిన మాటలు...

అమ్మ గుంటూరు జిల్లా నరసరావుపేటలో రామమోహనరావు, శకుంతలమ్మ దంపతులకు పుట్టారు. అమ్మకి నలుగురు అన్నదమ్ములు. అమ్మ ఒక్కర్తే ఆడపిల్ల. అమ్మకి నేను ఒకే ఒక్క కొడుకుని. కాని అందరినీ సొంత పిల్లల్లా చూసుకునేది. పళ్లు లేని ఒక ముసలి డాన్స్‌ మాస్టర్‌ దగ్గర అమ్మకు డాన్స్‌ నేర్పించారట. అమ్మ ఆయనను వెక్కిరించటంతో, ఆయనకు కోపం వచ్చి, డాన్స్‌ నేర్పించనన్నారట. రావు బాలసరస్వతి గారు వచ్చేసరికి ఏమీ ఎరగనట్టు అమాయకత్వం నటించేదట.

ఆవిడ అమ్మకు దూరపు బంధువు. ఆవిడే అమ్మలోని కళాకారిణిని గుర్తించారట. చదువు మీద శ్రద్ధ లేదు కనుక సినిమాల్లోకి ప్రవేశిస్తే బావుంటుందని ఇంట్లో వారు భావించటంతో, ‘పాండురంగ మహాత్మ్యం’ లో కృష్ణుడి వేషంతో సినీ రంగంలో తొలి అడుగు వేసింది అమ్మ. ఎన్‌టిఆర్‌ గారు అమ్మ పాదాలకు పారాణి వేసి, నుదుట తిలకం దిద్ది, ఆశీర్వదించారు. అమ్మ సన్నగా ఉందని వెన్నముద్దలు పెట్టించారు. 

నా బట్టలు కుట్టింది..
నేను చాలా బలంగా పుట్టానట. అమ్మ తన మొదటి సంపాదనతో లాక్టోజెన్‌ పాల డబ్బా కొందట. కుట్టు మిషన్‌ కొని, బట్టలు కుట్టిందట నాకు. నేను చిన్నప్పటి నుంచి అమ్మలాగే అల్లరి చేసేవాడినట. స్కూల్‌కి సైకిల్‌ మీద వెళ్లమనేది. నేను పదో తరగతి ఫెయిలైనప్పుడు బాధపడింది. డాక్టర్‌ చదివించాలనే అమ్మ కోరిక నెరవేర్చలేకపోయినా, నటుడిగా డాక్టరేట్‌ అందుకుని, తృప్తి కలిగించాను. నేను రాజకీయాలలోకి వెళ్లటం ఇష్టం లేకపోయినా, ‘వద్దు’ అనకుండా ప్రోత్సహించింది.

ఒకసారి షూటింగ్‌కి ఆలస్యంగా వెళ్లినందుకు, ‘‘క్రమశిక్షణ లేకపోతే నాకు నచ్చదు’’ అంది. హీరోయిన్‌తో ఒక టబ్‌లో ఉండే సీన్‌ అమ్మ ముందు నటించటానికి సిగ్గుపడితే, ‘షూటింగ్‌ సమయంలో నువ్వు నటుడివని గుర్తుంచుకో’’ అని మందలించింది. ‘చిత్రం భళారే విచిత్రం’ నా పాత్ర చూసి, ‘నీ రెమ్యునరేషన్‌లో సగం నాకు ఇవ్వాలి’ అని సరదాగా అంది. 

గడియారాలే నడిపించాయి..
అమ్మకు కాలం విలువ బాగా తెలుసు. అందుకు చిహ్నంగా ఇంటి నిండా గడియారాలు ఉన్నాయి. ‘నాకు కాలం విలువ తెలుసు కనుకనే ఈ రోజు ఇన్ని పనులు ఒకేసారి చేయగలుగుతున్నాను’ అంది. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవటం దగ్గర నుంచి అన్నీ గడియారపు ముళ్లను అనుసరించే చేసేది అమ్మ. ఇప్పటికీ ఈ గడియారాలే నాకు పాఠాలు చెబుతున్నాయి.

భువన విజయం..
నన్ను అమ్మ ‘నరే’, ‘నరి’ అనీ, ‘నారీ’ అని పిలిచేది. అమ్మను చిన్నప్పుడు ‘మమ్మీ’ ‘మీరు’ అనేవాడిని. చివరి పది సంవత్సరాలలో అమ్మకి బాగా చేరువయ్యాను. అమ్మ పేరు జత చేసి, ‘విజయకృష్ణ నరేశ్‌ కుమార్‌’ అని మార్చుకున్నాను. అమ్మకి దేవాలయం కట్టి, ‘భువన విజయం’ అని పేరు పెట్టాను. ఆవిడ బహు ముఖీనురాలు. ఒక రైతు, ఒక రాజకీయవేత్త, ఒక సోషల్‌ వర్కర్, ఒక దర్శకురాలు, ఒక నటి, ఒక భార్య, ఒక తల్లి. అమ్మ పాదాలను ప్రింట్‌ తీసి బంగారు పాదాలు చేయించాను.

నన్ను తన జీవిత చరిత్ర రాయమని చెప్పింది అమ్మ. అమ్మను ‘అమ్మ’ అనటం కంటె ‘అమ్మవారు’ అంటాను. ఆవిడకు భూకంపమంత కోపం, భూదేవికున్నంత సహనం ఉన్నాయి. అందంగా వెళ్లిపోవాలనుకున్న ఆవిడ ఆఖరి కోరిక తీర్చుకుని ముత్తయిదువులా వెళ్లిపోయింది. పనివాళ్లను కూడా ప్రేమగా చూసేది. మా దగ్గర పది సంవత్సరాలు పనిచేసిన వాళ్లకి ఇల్లు కట్టించింది. తను వెళ్లిపోయాక కూడా తను చేస్తున్నవన్నీ చేయమని కోరింది. నేను ఆవిడ కోరిక నెరవేరుస్తానన్నాను.

వంటల షెడ్యూల్‌...
అమ్మకు గోంగూరమాంసం – గారెలు చాలా ఇష్టం. లొకేషన్‌లో 30 మందికి వండి వడ్డించేది. ఉమ్మడి కుటుంబంలో వారానికి సరిపడా వంటకు సంబంధించి ఒక టైమ్‌ టేబుల్‌ వేసేది. చివరి రోజుల వరకు తన పనులన్నీ తనే చేసుకుంది. అమ్మకు గులాబీలంటే ఇష్టం. నిద్ర లేవగానే ఆ పూలతోనే భగవంతుడిని పూజించేది. గంధంతో చేసిన చీర ఉంది అమ్మకి. నగల కంటె భూమికి విలువ ఇచ్చేది. ఆ భూమే మమ్మల్ని కాపాడింది. పెళ్లిళ్లకు ఆర్థికంగా సహాయపడేది.
సంభాషణ: వైజయంతి పురాణపండ

చదవండి: దొంగతనం కేసులో ‘క్రైమ్​ పెట్రోల్’  సీరియల్‌ యాక్టర్స్‌ అరెస్టు

మరిన్ని వార్తలు