Happy Birthday Rajendra Prasad: నిరాశతో వెనుదిరిగిన టైంలో అలాంటి అవకాశం.. ఆపై జమజచ్చ టర్నింగ్‌ పాయింట్‌

19 Jul, 2021 09:11 IST|Sakshi

Rajendra Prasad Biography: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి పూర్తిస్థాయి కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్. అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. దాదాపు పాతిక సంవత్సరాల పాటు హీరోగా తెలుగు ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడాయన. రాజేంద్ర ప్రసాద్‌ అంటే కేవలం నవ్వులు మాత్రమే కాదు. నవరసాలను అద్భుతంగా పండించగల పరిపూర్ణ నటుడు. అందుకే హీరో అవకాశాలు తగ్గాక.. సహాయనటుడిగా రకరకాల పాత్రలు పోషిస్తూ ఆడియొన్స్‌ను అలరిస్తూ వస్తున్నాడు. ఈ నటకిరీటీ పుట్టినరోజు ఇవాళ. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: తెలుగు ప్రేక్షకులకు వీరాభిమానం ఉన్న నటుల్లో ఒకరు రాజేంద్ర ప్రసాద్. కానీ, అవకాశాలు ఆయనకు అంత సులువుగా రాలేదు. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1956 జులై 19న పుట్టాడు. తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. తండ్రి ఓ టీచర్‌. నిమ్మకూరు సీనియర్ ఎన్టీఆర్ గారి స్వస్థలం కావడంతో, ఆయన నటనా ప్రభావం రాజేంద్రప్రసాద్ మీద పడింది. మిమిక్రీలు చేస్తూ ఎన్టీఆర్‌నే మెప్పించేవాడు. సిరామిక్ ఇంజినీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాక నటన అవకాశాల కోసం ఉవ్విళ్లూరాడు. ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ లో చేరాడు. గోల్డ్ మెడల్ దక్కినా.. సినిమా అవకాశాలు మాత్రం దక్కలేదు. ఆకలి పస్తులు, ఓపిక నశించడంతో చావు తప్ప మరోమార్గం లేదు. అలాంటి టైంలో ఒక్క అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 

డబ్బింగ్‌తో మొదలు.. 
రాజేంద్ర ప్రసాద్‌ తన దగ్గర బంధువైన సినీ నిర్మాత, నటుడు, రచయిత అట్లూరి పుండరీకాక్షయ్య కలిశాడు. ఆ టైంలో పుండరీకాక్షయ్య ఎన్టీఆర్‌తో ‘మేలుకొలుపు’ సినిమా తీస్తున్నాడు. అయితే ఆ చిత్రం లోని ఒక తమిళ నటుడు పాత్రకు రాజేంద్ర ప్రసాద్‌తో డబ్బింగ్ చెప్పించారాయన. దీంతో కొన్నాళ్లపాటు డబ్బింగ్‌లు చెబుతూనే.. అవకాశాల కోసం ప్రయత్నించాడు. అలా బాపు ‘స్నేహం’లో ఓ చిన్న రోల్‌ దక్కింది. రాజేంద్ర ప్రసాద్‌ తొలి సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత చాయ, నిజం, మూడు ముళ్ల బంధం, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు, పోరాటం, ఈ చదువులు మాకొద్దు, రోజులు మారాయి, వందేమాతరం వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మంచుపల్లకి నటుడిగా రాజేంద్రుడిని మరో మెట్టు పైకి ఎక్కించింది.

మలుపు తిప్పిన జమజచ్చ
డైరెక్టర్‌ వంశీ 1985లో రాజేంద్ర ప్రసాద్‌ను పెట్టి హీరోగా ‘ప్రేమించు-పెళ్లాడు’ అనే సినిమా తీశాడు. కానీ, హీరో డెబ్యూ మూవీ రాజేంద్ర ప్రసాద్‌కి నిరాశే మిగిల్చింది. అయినా వంశీ రాజేంద్ర ప్రసాద్‌ను వదల్లేదు. ఈసారి కసితో ‘లేడీస్ టైలర్’(1986) తీశాడు.  ఫలితం.. సంచలన విజయం. టైలర్‌ సుందరంగా, జాతకాల పిచ్చోడి క్యారెక్టర్‌లో హిలేరియస్‌ పర్‌ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడాయన.

ఆపై అహనా పెళ్లంట లాంటి చిత్రం ఆయన కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. అటుపై అప్‌ అండ్‌ డౌన్స్‌తో సాగిన హీరో ప్రయాణం, సెకండ్‌ హీరో లీడ్స్‌తో సాగిపోయింది. ఇక ‘ఏప్రిల్‌ 1 విడుదల’లో దివాకరం పాత్ర రాజేంద్ర ప్రసాద్‌కు కంప్లీట్‌ కామెడీ హీరో ట్యాగ్‌ను తెచ్చిపెట్టింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజను దొంగలు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మేడమ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, శ్రీరామ చంద్రులు..‘అబ్బో...’ఇలా చెప్పుకుంటూ బోలెడన్ని సినిమాల్లో తన స్టైల్‌ యాక్టింగ్‌తో మెప్పించారాయన.

  

ఆల్‌రౌండర్‌ నటన 
వరుసగా కామెడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో ఫ్యామిలీ హీరోగానూ ఆయనకు ఒక ముద్రపడిపోయింది. అయితే రాజేంద్ర ప్రసాద్‌ కెరీర్‌ తొలినాళ్లలో సీరియస్‌ పాత్రలు సైతం పోషించారు. ఛాలెంజ్‌లో విద్యార్థిగా ఓ ముఖ్యపాత్రలో, కాశ్మోరాలో దార్కాగా, ప్రేమ తపస్సులో రత్తయ్యగా అమాయకుడి పాత్రలో, ఎర్రమందారంతో పాటు ముత్యమంత ముద్దులో ప్రేమ సన్యాసిగా అనుదీప్‌ క్యారెక్టర్‌లో అలరించాడు. అయితే హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న టైంలో ఆయన యాక్టింగ్‌ కెరీర్‌లో ఓ మరిచిపోలేని గుర్తింపు ఇచ్చింది ‘ఆ నలుగురు’. 

రఘురామ్‌ పాత్రలో నలుగురి మంచి కోరే వ్యక్తిగా ఆయన నటన అందరితో కంటతడి పెట్టించింది.  టామీ, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. ఇక హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, సుప్రీమ్, శమంతకమణి, కౌసల్య కృష్ణమూర్తి, అలా వైకుంఠపురంలో.. ఇలా ఆయన నటనా ప్రస్తానం కొనసాగుతూ వస్తోంది. అంతేకాకుండా హాలీవుడ్ లోనూ “క్విక్ గన్ మురుగన్” చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మించారు, అలాగే 2012లో ‘డ్రీమ్’ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం ద్వారా నటకిరీటికి వరల్డ్‌ ఫేమ్‌ తెచ్చిపెట్టింది.

సపోర్టింగ్‌ రోల్స్‌, కామెడీ వేషాలేసివాళ్లు కూడా హీరోగా సక్సెస్‌ కావొచ్చని ప్రూవ్‌ చేసిన తెలుగు నటుడు డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్. కానీ, ఆ కష్టం వెనుక ఆయన నిర్మించుకున్న ‘హ్యూమర్‌’ అనే సెపరేట్‌ ట్రాక్‌ ఒకటి ఉంది. తర్వాతి కాలంలో ఎందరో హీరోలు ఆ దారిలో ప్రయాణించాలని ప్రయత్నించారు. అయితే ఆయన అందించిన నవ్వుల మార్క్‌ను మాత్రం ఎవరూ క్రాస్‌ చేయలేకపోతున్నారనడం అతిశయోక్తేం కాదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు