మన తెనాలి రామకృష్ణ.. అక్కినేని

19 Sep, 2020 08:34 IST|Sakshi

నాటక రంగం నుంచి సినీ రంగానికి బీజం

ఏ పాత్ర అయినా  పరకాయ ప్రవేశం

మెప్పించి.. ఒప్పించిన నట సామ్రాట్‌

దాదాసాహెబ్‌ ఫాల్కే, పద్మ విభూషణ్‌ వంటి గౌరవాలు సొంతం

అక్కినేనికి ఆంధ్ర ప్యారిస్‌తో ప్రత్యేక అనుబంధం

‘బాలరాజు’గా ‘కీలుగుర్రం’ ఎక్కి.. ‘లైలాను–మజ్నూలా ప్రేమలో ముంచి.. పారూ కోసం ‘దేవదాసు’లా మారి.. ‘అనార్కలి’ కోసం సలీంలో పరకాయ ప్రవేశం చేసి.. ‘మూగ మనసు’తో ముద్ద బంతి పువ్వును మురిపించి.. ‘నవరాత్రి’లో నవరస నటన ప్రదర్శించి.. ‘దసరా బుల్లోడు’గా దుమ్ములేపి.. ‘ప్రేమనగర్‌’కు ‘మేఘసందేశం’ పంపించి.. అభిమానులకు ‘ప్రేమాభిషేకం’ చేసి.. ‘మనం’ అంతా ఒక్కటే నంటూ మూడు తరాలతో ముచ్చట చేసి దివికేగిన నటసామ్రాట్‌ అక్కినేని. ఈ అక్కినేనికి అదృష్ట దేవత ఎదురొచ్చి ఆహ్వానించి అద్భుతమైన నటుడిగా నిరూపించుకునే అవకాశం కల్పించింది మన తెనాలి. రేపు అక్కినేని జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 

తెనాలి : అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవపురంలో  ఓ రైతు కుటుంబంలో 1924 సెప్టెంబరు 20న జన్మించారు. నాగేశ్వరరావుకు మూడున్నరేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. పొరుగు ఊరిలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించినా చదువుపై ధ్యాస ఉండేది కాదు. గ్రామాల్లో జరిగే కోలాటాలు, భజన్లు, ఊరేగింపుల్లో పాటలు పాడేవారితో తిరుగుతూ.. అనుకరించేవాడు. ఈ క్రమంలో పాటలు, పద్యాలు వంటపట్టాయి. తొలిసారి ఆరో తరగతిలో స్కూల్‌ పిల్లలతో కలిసి ‘హరిశ్చంద్ర’ నాటకంలో నారద పాత్ర వేశాడు.

పాఠశాల వార్షికోత్సవంలో చంద్రమతిగా స్త్రీ పాత్రలో నటించాడు. ఇంటి నుంచి ప్రోత్సాహం ఉండటంతో నాటక సమాజాల్లో వేషాలు వేశాడు. అలా స్త్రీ పాత్రల్లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఓ సారి సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది. ఆ తర్వాత నాటకాల్లో వేషాలు కొనసాగించారు.
 
చిన్న వేషంతో సరిపెట్టి.. 
నాగేశ్వరరావుకు ధర్మపత్ని సినిమాలో అవకాశం వచ్చినా అందులో పిల్లలంతా కలిసి పాడుకునే పాట సన్నివేశంలోనే వేషం ఇచ్చారు. ఆ తర్వాత ముదినేపల్లిలోని ఎక్సెల్షియర్‌ క్లబ్‌ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావు ఒక నాటక ప్రదర్శనలో అక్కినేనిని చూసి తన నాటక సమాజానికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత క్లబ్‌లో శాశ్వత ప్రాతిపదికన ‘నాయిక’ పాత్రలకు ఒప్పందం చేసుకున్నారు.

ఇలా మలుపు తిరిగింది.. 
క్లబ్‌ ప్రదర్శించిన తెలుగు తల్లి, సత్యాన్వేషణ, ఆశాజ్యోతి నాటకాలు ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలోనే ఇతర జిల్లాల నుంచి నాటక ప్రదర్శనలకు క్లబ్‌కు ఆహ్వానాలు ఎక్కువయ్యాయి. అలా తెనాలి నుంచి ఆహ్వానం రావడంతో తెనాలిలో నాగేశ్వరరావు ఆశాజ్యోతి నాటకంలో స్నేహలత పాత్ర పోషణతో స్థానిక ప్రేక్షకులను మెప్పించారు. తిరుగు ప్రయాణంలోనే అక్కినేనిని అదృష్టం ఎదురొచ్చి స్వాగతించింది. అక్కడి నుంచే ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. 

తెనాలితో ప్రత్యేక అనుబంధం.. 
నాటకాల్లో సహనటి అంజలి దంపతులు 1957లో తీసిన సువర్ణసుందరి సినిమా శత దినోత్సవానికి నాగేశ్వరరావు స్థానిక స్వరాజ్‌ టాకీస్‌కు వచ్చారు. తర్వాత అక్కినేని సినీజీవిత వజ్రోత్సవ వేడుకలను తెనాలిలో వైభవంగా నిర్వహించగా, అక్కినేనిని భారీ ఊరేగింపుతో తీసుకొచ్చి సత్కరించారు. దేవదాసు సినిమా 1980ల్లో విడుదలైనప్పుడు తెనాలిలో 300 రోజులు ఆడటాన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు. 

రైల్వేస్టేషన్‌లో బుల్లోడు.
తెనాలిలో ఓ ప్రదర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు నాగేశ్వరరావు నాటక బృందం చేరుకుంది. తోటి సభ్యులతో కలిసి రైలు ఎక్కుతున్న నాగేశ్వరరావును అదే రైల్లోని ఫస్ట్‌క్లాస్‌ ఏసీలో ఉన్న ప్రతిభా సంస్థ ఘంటసాల బలరామయ్య గమనించారు. దగ్గరకు పిలిచి పేరు, ఊరు వివరాలు తెలుసుకుని ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడిగారు. సీతారామ జననం సినిమాలో శ్రీరాముడు పాత్రధారి కోసం అన్వేషిస్తున్న నిర్మాత బలరామయ్య దృష్టిలో పడిన నాగేశ్వరరావు, ఆయన ఆహ్వానంతో దుక్కిపాటి మధుసూదనరావుతో కలిసి 1944 మే 8న చెన్నైలో అడుగుపెట్టారు. చెప్పినట్టే బలరామయ్య అవకాశమిచ్చి ఆశీర్వదించారు. అప్పటి నుంచి నటనలో వెనుదిరిగి చూడలేదు. దాదా సాహెబ్‌ ఫాల్కే, పద్మ విభూషణ్‌ వంటి అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. చివరగా ‘మనం’ సినిమాలో కొడుకు, మనుమడితో కలిసి నటించి అక్కినేని మూడు తరాల నటనను వెండి తెరపై పూయించారు. 

మరిన్ని వార్తలు