Hero Naveen Chandra: తండ్రి కోసం కొడుకు చేసే యుద్ధమే 'పరంపర 2'..

18 Jul, 2022 14:40 IST|Sakshi

Naveen Chandra About His Role In Parampara 2: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.. ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర 'గోపీ' పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్  డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ విశేషాలను పంచుకున్నారు నవీన్ చంద్ర.

- పరంపర వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్ ను మీ ముందుకు తీసుకురాగలిగాం. దీనికి ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ముందు చూపే కారణం. ఫస్ట్ సీజన్ హిట్టయితే తప్పకుండా సెకండ్ సీజన్ కు క్రేజ్ ఉంటుందని వాళ్లు సరిగ్గానే అంచనా వేశారు.

- ఈ వెబ్ సిరీస్ లో గోపి అనే పాత్రలో నటించాను. పొలిటికల్ రివేంజ్ డ్రామా ఇది. నా క్యారెక్టర్ ఈ సెకండ్ సీజన్ లోనే పవర్ ఫుల్ గా మారుతుంది. ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ సీజన్ లో నేను అతని మీద పైచేయి సాధిస్తాను. తన  తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తుంటాడు.

- ఈ వెబ్ సిరీస్ లో ఆరేడు పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నాకు ఇలాంటి కథలంటే చాలా ఇష్టం. హీరోకు స్కోప్ ఉండి మిగతా పాత్రలు తేలిపోతే అందులో ఆసక్తి ఉండదు. అన్ని క్యారెక్టర్స్‌కు నటించేందుకు అవకాశం ఉండాలి. అప్పుడే కథ బాగుంటుంది. మొదటి సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సిరీస్ ను ఇంకా జాగ్రత్తగా అన్ని ఎమోషన్స్ కలిపి చేశాం.

- రామ్ చరణ్ మా సిరీస్ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టార్స్ తో ప్రమోషన్ చేస్తే దాని రీచింగ్ వేరుగా ఉంటుంది. కోవిడ్ వల్ల థియేటర్స్ కు దూరమైన ప్రేక్షకులు ఓటీటీని ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. మధ్యలో మళ్లీ థియేటర్లకు వెల్లారు. ఇప్పుడు ఓటీటీపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ఎక్కడున్న వాళ్ల ఆదరణ దక్కుతుందని నా నమ్మకం.

- నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదులుకోను. నా మొదటి చిత్రం 'అందాల రాక్షసి'తో గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ'లో నటించినప్పుడు మరోసారి ఫేమ్ అయ్యాను. ఎన్టీఆర్ ఆ సినిమా ఫంక్షన్ స్టేజీ మీదే నా పాత్ర గురించి, నెను ఎంత బాగా నటించాను అనేది చెప్పారు. అది ఇండస్ట్రీలో బాగా రీచ్ అయ్యింది.

- నేను విలన్ పాత్రల్లో నటించినా మీ విలనీ బాగుంది అంటారు. గ్రే క్యారెక్టర్స్ చేసినా బాగుంటుంది అని చెబుతుంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చేది స్పందన నిజాయితీగా ఉంటుంది. నేను అది ఎక్కువగా తీసుకుంటాను. సోషల్ మీడియా ద్వారా కూడా అన్నా, మీ క్యారెక్టర్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటారు. 'విరాటపర్వం'లో నా రోల్ పెంచాల్సింది అనే కామెంట్స్ వచ్చాయి.

- నటుడిని అయ్యేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నాలో నటన మీద ఎలాంటి ఇష్టం ఉందో, ఇప్పటికీ అదే ఆసక్తి , ఉత్సాహం ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను.

మరిన్ని వార్తలు