Naveen Polishetty: నమ్మకం నిజమైంది

22 Sep, 2023 04:18 IST|Sakshi

– నవీన్‌ పొలిశెట్టి

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో వాళ్లే మా సినిమాను ప్రమోట్‌ చేశారు. ప్రమోషన్‌ టూర్‌ కోసం గత 25 రోజుల్లో 75 సిటీస్‌కి వెళ్లాను. అమెరికాలో ప్రమోషన్‌కి వెళ్లినప్పుడు హోటల్‌లో నిద్రపోయే టైమ్‌ ఉండేది కాదు. ఈస్ట్‌ నుంచి వెస్ట్‌కు ప్రయాణం చేసే విమానంలోనే నిద్రపోయేవాణ్ణి. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్లా కాబట్టి నాకు కష్టం అనిపించలేదు’’ అని హీరో నవీన్‌ పోలిశెట్టి అన్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నవీన్‌ పొలిశెట్టి విలేకరులతో చెప్పిన విశేషాలు.

► మంచి సినిమా చేశాం.. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉండేది. అది నిజమైంది. తెలుగులో వసూళ్లు నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకున్నాయి.. మూడో వారంలోనూ మంచి వసూళ్లు ఉన్నాయి. అమెరికాలోనూ మూడో వారంలో మంచి వసూళ్లు ఉండటంతో మరిన్ని స్క్రీన్స్‌ పెంచుతున్నారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లోనూ షోలు పెంచుతున్నారు. మా మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్‌.

► నా తొలి చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నేను బాగా నటించగలనని నిరూపించింది. నా సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రొడ్యూసర్స్, బయ్యర్స్‌లో వచ్చింది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు.. భావోద్వేగాలు కూడా పండించగలను అని నిరూపించుకున్నా. 

► తెలుగులో చిరంజీవి, ప్రభాస్‌గార్లు, హిందీలో ఆమిర్‌ ఖాన్‌గారు ఇష్టం. అలాగే అన్ని జానర్స్‌ సినిమాలను ఇష్టపడతాను. హిందీలో రాజ్‌కుమార్‌ హిరాణీగారి చిత్రాలంటే ఇష్టం. తెలుగులో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, భైరవ ద్వీపం, ఆదిత్య 369’ వంటి సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు