Nawazuddin Siddiqui: 'నువ్వు యాక్టరేంటి? నిన్ను తీసుకుంటే సమయం, డబ్బులు వృథా'

28 Apr, 2022 09:04 IST|Sakshi

మనసుకు నచ్చిన పాత్రలతో పాటు వైవిధ్యానికి ఆస్కారమున్న రోల్స్‌ మాత్రమే చేసే బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖి. వందల అవకాశాలు తలుపు తట్టినా అందులో తనకు నచ్చిన నాలుగైదు ఆఫర్లకు మాత్రమే ఓకే చెప్పి, నచ్చనివాటన్నింటికీ నిర్మొహమాటంగా నో చెప్తాడు. అయితే నవాజుద్దీన్‌కు స్టార్‌డమ్‌ అంత ఈజీగా ఏం రాలేదు. మొదట్లో తనను చూసి అసలు నటుడిగానే లేవని, యాక్టింగ్‌కు నువ్వేం పనికి వస్తావని అనేవారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

'నేనెక్కడికి వెళ్లినా ఒకటే అనేవారు.. నేను నటుడిగా పనికిరానని, ఇంకేదైనా పని చూసుకుంటే బెటర్‌ అని చెప్పేవారు. యాక్టర్స్‌ అసలు నీలా ఉండరు, నువ్వు ఎప్పటికీ నటుడివి కాలేవు. ఎందుకు సమయం వృధా చేస్తున్నావు? ఇంకేదైనా పని చూసుకో అని సలహాలిచ్చేవారు. ఏ ఆఫీస్‌ మెట్లెక్కినా ఇదే రిపీట్‌ అవుతూ ఉండేది. ఫైనల్‌గా ఓ పదేళ్లకు నన్ను నేను నటుడిగా నిరూపించుకోగలనన్న ధైర్యం వచ్చింది. ఎందుకంటే సరిగ్గా అప్పుడే రియలిస్టిక్‌ సినిమాలు తీసే డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చారు. మేము వారితో కలిసి పనిచేశాం. ఆ సినిమాలు పెద్దగా వర్కవుట్‌ అవలేవు కానీ వాటికి ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రశంసలు మాత్రం దక్కేవి'

'అది చూసిన కమర్షియల్‌ దర్శకులు మమ్మల్ని సినిమాల్లోకి తీసుకున్నారు. ఇక టీవీలో పని అడిగితే.. నిన్ను మేము తీసుకోలేము. ఎందుకంటే నీతో షూట్‌ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ లైట్స్‌ వాడాలి. సాధారణంగా ఒకరోజులో ఒక ఎపిసోడ్‌ షూట్‌ చేస్తాం. కానీ నిన్ను తీసుకుంటే అది కాస్తా ఒకటిన్నర రోజు పడుతుంది. నీవల్ల మేము చాలా నష్టపోతాము. నువ్వు ఇంకెక్కడైనా చూసుకో అని హేళన చేశారు. అప్పుడు నేనిక సినిమాలే చేయాలని డిసైడ్‌ అయ్యాను. మొదట్లో నాకు కేవలం ఒకటీ రెండు నిమిషాల నిడివి ఉన్న పాత్రలే ఇచ్చేవారు. ఐదారేళ్లపాటు ఇదే కొనసాగింది. ఆ తర్వాత ఓ రెండు సన్నివేశాల్లో కనిపించే ఛాన్స్‌ ఇచ్చారు. ఈ ధోరణి మరో ఐదేళ్లపాటు సాగింది. పదేళ్ల కష్టం తర్వాతే నాకంటూ గుర్తింపునిచ్చే పాత్రలు వచ్చాయి' అంటూ తాను ఇండస్ట్రీలో పడ్డ కష్టాలను వివరించాడు నవాజుద్దీన్‌ సిద్ధిఖి.

చదవండి: దీపికాకు అరుదైన గౌరవం, జ్యూరీ మెంబర్‌గా మన హీరోయిన్‌!

సెల్ఫీ దర్శకుడికి బంపరాఫర్‌, స్టేజీపైనే రూ.10 లక్షల చెక్‌

మరిన్ని వార్తలు