రజనీకాంత్‌ 'జైలర్‌' సీక్వెల్‌లో స్టార్‌ హీరోయిన్‌కు ఛాన్స్‌

23 Jan, 2024 07:20 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మరోసారి జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అతిథి పాత్ర పోషించిన లాల్‌ సలాం చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన తెరపైకి రానుంది. ఆయన పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. కాగా ప్రస్తుతం జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ వేట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళం స్టార్‌ హీరోయిన్‌ మంజు వారియర్‌ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

కాగా రజనీకాంత్‌ తన 171వ చిత్రాన్ని లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్‌ తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారనే వా తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈయన ఇంతకుముందు నటించిన జైలర్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇందులో ఆయన సరసన నటి నయనతార నటించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ జంట చంద్రముఖి, కథానాయకుడు, శివాజీ, దర్భార్‌, అన్నాత్తే మొదలగు ఐదు చిత్రాలలో కలిసి నటించింది. తాజాగా ఆరోసారి ఈ కాంబోలో చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు