Nayanthara: ఆ మూవీతో అలా కూడా నటించగలనని నిరూపించా: నయనతార

27 Feb, 2024 14:59 IST|Sakshi

భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి నయనతార. కేరళలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన డయానా కురియన్‌ అనే అమ్మాయి నయనతారగా మారి కథానాయకిగా విశ్వరూపం ఎత్తారు. తమిళంలో అయ్యా, చంద్రముఖి వంటి గ్రామీణ నేపథ్యంలో సాగే కథా చిత్రాల్లో నటించి విజయాలను సొంతం చేసుకున్న నయన్.. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల హిందీలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సరసన ఆమె నటించిన జవాన్‌ చిత్రం ఇండియన్‌ స్టార్‌ను చేసింది.

ప్రస్తుతం తమిళంలో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార ఏ చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అంతే కాదు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. అలాంటిది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తను నటించిన బిల్లా చిత్రం గురించి ఘనంగా చెప్పడం విశేషం. గతంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన బిల్లా చిత్రాన్ని అజిత్‌ హీరోగా రీమేక్‌ చేశారు. విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహించిన ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించారు. 

నమిత ప్రత్యేక పాత్రను పోషించిన ఈ చిత్రం 2007లో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అజిత్‌‌ నటన, నయనతార గ్లామర్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. బిల్లా తన కెరీర్‌ను టర్నింగ్ తిప్పిన చిత్రం అని నయనతార ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకు బాగా నచ్చిన చిత్రమని అన్నారు. తను అంతకు ముందు వరకూ గ్రామీణ కథా పాత్రల్లో నటించగా.. నగర నేపథ్యంలో మొట్టమొదటిగా స్టైలిష్‌ పాత్రను బిల్లా చిత్రంలో పోషించానని తెలిపింది. ముఖ్యంగా బిల్లా చిత్రంలో నటించడానికి అంగీకరించడానికి కారణం గ్లామరస్‌గా కూడా నటించగలనని నిరూపించడానికే అని నయనతార పేర్కొన్నారు. ఆ చిత్రంలో ఈ భామ స్విమ్మింగ్‌ దుస్తుల్లో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టించింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు