Nayanthara-Vignesh Shivan wedding: భారీ ఆఫర్‌తో ఆ సంస్థకు వివాహ వేడుకల ప్రచార హక్కులు

10 Jun, 2022 06:35 IST|Sakshi

తమిళసినిమా: హీరోయిన్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ జంట గురువారం ఒక్కటయ్యింది. స్థానిక మహాబలిపురంలోని షేర్టన్‌ గార్డెన్‌ వేదికైంది. రెండు రోజుల ముందే అంటే మంగళవారం సాయంత్రమే వివాహ వేదికకు చేరుకుని మెహందీ వేడుకలు జరుపుకున్నారు. గురువారం సినీ ప్రముఖుల రాకతో పెళ్లి వేదిక కళకళలాడింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య విఘ్నేష్‌ శివన్‌ నయనతార మెడలో మాంగల్యధారణ చేశారు.  

భారీ ఆఫర్‌తో నెట్‌ఫ్లిక్స్‌ ప్రచార హక్కులు 
నయనతార, విఘ్నేష్‌శివన్‌ వివాహ వేడుకల ప్రచార హక్కులను నెట్‌ప్లిక్స్‌ సంస్థ రూ.25 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. దీంతో 5 రోజుల నుంచే ఈ సంస్థ వివాహ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. సముద్రతీరంలో అద్భుతమైన అద్దాల మేడలో వివాహ వేదికను తీర్చి దిద్దారు. ఇందుకు ఢిల్లీ, ముంబయిల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. 50 మందికి పైగా బౌన్సర్లు, ప్రైవేటు రక్షకులను రప్పించి వివాహ వేడుక పరిసర ప్రాంతాలను వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆహ్వాన పత్రిక ఉన్న వారిని మాత్రమే ప్రవేశానికి అనుమతించారు.  

పెళ్లికి ముందు విఘ్నేష్‌ శివన్‌ ట్వీట్‌ 
దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ పెళ్లికి కొద్ది గంటల ముందు తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో ఓ ట్వీట్‌ చేశారు. అందులో ‘‘ దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పుడు నా జీవితాన్ని నయనతారకు సమర్పించబోతున్నాను. నా బంగారంతో మరి కొద్ది గంటల్లో ఒకటి కాబోతున్నాం అన్న భావనే ఉత్సాహాన్నిస్తోంది..’’అని పేర్కొన్నారు. కాగా తమ వివాహ వేడుక సందర్భంగా నయనతార, విఘ్నేష్‌ శివన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, అనాథాశ్రమాలలో లక్షమందికి అన్నదానం కార్యక్రమాలను ఏర్పాట్లు చేశారు.    

ప్రముఖుల ఆశీస్సులు..
ఈ వివాహానికి బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ఖాన్, నిర్మాత బోనీ కపూర్‌ ప్రత్యేకంగా విచ్చేసి నవ దంపతులకు శుభాకాంక్షలు అందించారు. నటుడు రజనీకాంత్, శరత్‌కుమార్, రాధిక, సూర్య, కార్తీ, విజయ్‌సేతుపతి, దర్శకుడు మణిరత్నం, గౌతమ్‌మీనన్, అట్లీ, ఏఆర్‌ రెహ్మాన్, అనిరుధ్, కుష్భు సుందర్, విక్రమ్‌ ప్రభు, ఎడిటర్‌ మోహన్, దర్శకుడు మోహనరాజా, ఐసరి గణేష్, శాలిని అజిత్‌కుమార్‌ మొదలగు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఆశీస్సులు అందించారు. అత్యంత సన్నిహితులతో పాటు 200 మంది సినీ ప్రముఖులనే నయనతార, విఘ్నేష్‌ శివన్‌ ఆహ్వానించినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు