సుశాంత్‌ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్‌

19 Oct, 2020 10:08 IST|Sakshi

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్‌ కోణం వెలుగు చూడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఆ దిశగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడిని అరెస్టు చేసింది. అతనికి కూడా డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్‌సీబీ అతనిని రిమాండ్‌లోకి తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్‌ను డ్రగ్‌ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన ఎన్‌సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతనిని కస్టడీకి పంపారు. 

ఇప్పటికే సుశాంత్‌ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను, సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, పర్సనల్‌ స్టాఫ్‌ దీపేశ్‌సావంత్‌ తదితరులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక రియా ఈ కేసులు 28రోజుల జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలయ్యింది. వీరినే కాకుండా ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌ లాంటి వారిని కూడా ఎన్‌సీబీ విచారించింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు  పలు మలుపులు తిరుగుతోంది.  మాదకద్రవ్యాలకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చిన తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఎన్‌సీబీ కేసు నమోదు చేసింది.

చదవండి: ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌పై రూ.200 కోట్ల దావా

మరిన్ని వార్తలు