సినిమాల్లోకి రాకముందే పెళ్లి.. ఏడాదిలోపే విడిపోయాం: నటి

15 Jul, 2021 15:42 IST|Sakshi

మొదటి భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన నీనా గుప్తా

బాలీవుడ్‌ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా కంటే కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కల మహిళగానే ఆమెకు గుర్తింపు ఎక్కువ. దాదాపు 20 ఏళ్ల క్రితమే సింగిల్‌ పేరెంట్‌గా మారి.. తల్లీతండ్రి తానే అయి మసాబా గుప్తాను పెంచారు. తాజాగా విడుదలైన నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్‌ కహూ తో’ సినీ అభిమానులతో పాటు సామాన్యులను కూడా బాగా అలరించింది. తన కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి తెలియని తన జీవిత విశేషాలను దీనిలో వెల్లడించారు నీనా గుప్తా. మాజీ వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో సహజీవనం కంటే ముందే అంటే సినిమాల్లో రాకముందే తనకు వివాహం అయ్యిందని.. కానీ ఆ బంధం ఏడాది పాటు కూడా నిలవలేదని తన ఆత్మకథలో వెల్లడించారు నీనా గుప్తా. ఆ వివరాలు.. 

‘‘నా మొదటి భర్త పేరు అమ్లాన్‌ కుమార్‌ ఘోస్‌. మేమిద్దరం ఓ ఇంటర్‌ కాలేజ్‌ ఇవేంట్‌లో కలుసుకున్నాం. ఆ పరిచయం అలా పెరిగి ప్రేమగా మారింది. అప్పుడు అమ్లాన్‌ ఢిల్లీ ఐఐటీలో చదవుతుండేవాడు. నేను డిగ్రీ చదువుతున్నాను. మేం ఎక్కువగా ఢిల్లీ ఐఐటీ పరిసరాల్లో కలుసుకునేవాళ్లం. చాలా రోజుల పాటు మా ప్రేమ గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా.

‘‘కానీ కొన్నాళ్ల తర్వాత మా ప్రేమ గురించి మా అమ్మకు చెప్పాను. ఆమెకు ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచి నన్ను మరింత కంట్రోల్‌ చేయడం ప్రారంభించింది. ఓ సారి అ‍మ్లాన్‌ తన స్నేహితులతో కలిసి శ్రీనగర్‌ వెళ్తున్నాడు. వారితో నేను వెళ్లాలని భావించాను. కానీ మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. అతడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్లు అన్నది. అప్పటికే మాపై నిఘా ఎక్కువ్వయ్యింది. వీటన్నింటిని భరించే బదులు వివాహం చేసుకోవడం మేలని భావించాం’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా.

‘‘నేను బెంగాలీ అమ్మాయిని కాకపోవడంతో అమ్లాన్‌ తల్లిదండ్రులు, బంధువులు మా వివాహానికి అంగీకరించరని మాకు తెలుసు. వారికి మా పెళ్లి గురించి చెప్పలేదు. అందుకే నా కుటుంబ సభ్యులు, మా ఇద్దరి స్నేహితుల సమక్షంలో ఆర్మ సమాజ్‌లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత మేం రాజేంద్ర నగర్‌లో ఓ చిన్న ఇంటికి మారం. అమ్లాన్‌ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. నేను డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్శిటీలో సాంస్క్రిట్‌లో మాస్టర్‌ డిగ్రీ చేయడానికి జాయిన్‌ అయ్యాను’’ అన్నారు నీనా గుప్తా.

‘‘కానీ తర్వాత నాకు నాటకాలవైపు మనసు మళ్లింది. థియేటర్‌ యాక్టర్‌ కావాలని కలలు కన్నాను. నటన మీద నాకున్న ఆసక్తి అప్పుడే నాకు తెలిసింది. కాకపోతే దురదృష్టం కొద్ది అమ్లాన్‌ ఆలోచలను ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తను కేవలం ఇంటిని, తనను బాగా చూసుకునే భార్య కావాలని కోరుకున్నాడు. నేను ఇంటి పట్టునే ఉండి, తనను చూసుకోవాలని ఆశించాడు. దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి’’ అని రాసుకొచ్చారు నీనా గుప్తా.

‘‘పెళ్లైన ఏడాదిలోపే మా ఇద్దరి దారులు వేరని మాకు అర్థం అయ్యింది. మేం కలిసి ఉండలేమని కూడా తెలిసింది. దాంతో విడిపోయాం. అమ్లాన్‌ అంకుల్‌ ఒకరు మా విడాకుల విషయంలో సాయం చేశారు. నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాను. ఆ తర్వాత నటిగా మారడం, రిచర్డ్స్‌తో ప్రేమ, సహజీవనం, మసాబా జననం జరిగిపోయాయి. నేను, అమ్లాన్‌ ఎప్పుడు పెద్దగా అరుచుకుని గొడవపడలేదు.. ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకోలేదు. స్నేహపూర్వకంగానే విడిపోయాం. తను చాలా మంచి వ్యక్తి’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు