సేల్స్‌గర్ల్‌గా మారిన నటి!: క్లారిటీ ఇచ్చిన నీనా గుప్తా..

25 Jun, 2021 22:16 IST|Sakshi

బాలీవుడు సీనియర్‌ నటి నీనా గుప్తా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తన గురించి వచ్చిన ఓ ఫేక్‌ ఆర్టీకల్‌ గురించి తాజాగా గుర్తు చేసుకున్నారు. కాగా ‘సచ్‌ కహున్‌ తో’ అనే పేరుతో నినా స్వయంగా తన ఆత్మకథను రాసుకున్న సంగతి తెలిసిందే. ఈ బుక్‌ను ఇటీవల ఆమె విడుదల చేశారు. ఈ బయోగ్రఫి ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఆత్మకథకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు. ఈ నేపథ్యంలో కేరీర్‌ ప్రారంభంలో సేల్స్‌గర్ల్‌గా పని చేసినట్లు వచ్చిన తప్పుడు ఆర్టికల్‌ చదివి షాకయ్యానని చెప్పారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నా గురించి ఎన్నో సార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ మ్యాగజైన్‌లో శ్యామ్‌ ఆహుజా షాప్‌లో నేను సేల్స్‌గర్ల్‌గా చేరినట్లు తప్పుగా రాసినట్లు నాకు ఇప్పటికి గుర్తుంది. అయితే ఆ సమయంలో నాకు నిజంగా శ్యామ్‌ ఆహుజా ఎవరో తెలియదు. ఆ ఆర్టికల్‌ చదివాక నా స్నేహితులను అడిగాను. అప్పుడు వారు ఆయన ఓ వ్యాపారవేత్త అని ఆయనకు ఓ కార్పెట్‌ షాప్‌ ఉందని చెప్పారు. అది విని నేను షాక్‌ అయ్యాను. అలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదు. నేను ఎందుకు ఆయన షాప్‌లో పని చేస్తాను’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.

అలాగే తను సినిమాలకు ఎందుకు దూరమయ్యారో కూడా చెప్పారు. ‘నేను నా జీవితంలోకి ఓ తప్పుడు వ్యక్తిని ఆహ్వానించాను. అది నా ప్రొఫెషనల్‌ లైఫ్‌పై ప్రభావం చూపింది. అందుకే నటిగా సక్సెఫుల్‌ కెరీర్‌లో ఉన్నప్పటికి నటనను ఆపేశాను’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె నేటి తరం యువతులకు ఓ సందేశం కూడా ఇచ్చారు. ఎప్పుడు మీ పని మీదే దృష్టి పెట్టండని, పురుషులపై పెట్టకండి అంటూ సలహా ఇచ్చారు. ఓ ఒంటరి మహిళ తన కూతురు(మసాబా) పెంచడంతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలో నటిగా ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి నీనా గుప్తా తన ఆత్మకథలో వివరించారు. 

చదవండి: 
పాచిపని అయినా చేద్దామనుకున్నా: నటి

మరిన్ని వార్తలు