‘నేనెవరు’ మూవీ రివ్యూ

2 Dec, 2022 18:30 IST|Sakshi

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై  భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన చిత్రం "నేనెవరు". నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కింది. లవ్... సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు (డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
క్రిష్ (కోలా బాలకృష్ణ), చిత్ర (గీత్ షా) ఇద్దరు ప్రేమించుకుంటారు. ఓ విషయంలో గొడవపడి విడిపోతారు. ప్రియురాలు దూరం కావడంతో క్రిష్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ప్రేయసిని తలచుకుంటూ... తాగుడుకు బానిసై అందరితో గొడవ పడుతూ... కనిపించిన వారికి అంతా తన లవ్ స్టోరీ చెబుతూ తిరిగేస్తూ ఉంటాడు.  అయితే అదే సమయంలో  తన మేనత్త, మేనత్త కూతురు (తనిష్క్ రాజన్), జీకే(బాహుబలి ప్రభాకర్‌), మేనత్త అనుచరుడు నాయుడు వరుస హత్యలకు గురవుతారు. ఆ హత్యలకు కారణం ఎవరు? క్రిష్‌ జీవితంలోకి చిత్ర మళ్లీ వచ్చిందా లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
 ప్రేమతో ముడిపడిన క్రైం థ్రిల్లర్ మూవీ ఇది.  ఫస్ట్ హాఫ్ లో హీరోని భగ్న ప్రేమికుడిగా, తాగుబోతుగా చూపించి... ఆ తరువాత... మర్డర్ మిస్టరీని ఛేదించిన విధానం ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ క్రైం అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. దర్శకుడు రొటీన్ జోనర్స్ ని టచ్ చేయకుండా... ఓ డిఫరెంట్ జోనర్లో ఈ మూవీని తెరకెక్కించాడు. కథ, కథనాల పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే..
హీరోగా నటించిన కోలా బాలకృష్ణ భగ్న ప్రేమకుడిగా... రివెంజ్ డ్రామా లో ... మాస్ ను మెప్పించే పాత్రలో చక్కని నటన కనబరిచాడు. అలానే అతనికి జంటగా ప్రేయసి పాత్రలో గీత్ షా... చక్కగా నటించింది. హీరోను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే యువతిగా... కాస్త సైకోలా బిహేవ్ చేసే పాత్రలో ఆకట్టుకుంటుంది. అలాగే హీరో మరదలిగా తనిష్క్ రాజన్ మెప్పించింది. ఆమె అమ్మగా లేడి దాధాగా నటించిన నటి కూడా బాగా చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ గా నటించిన సాక్షి చౌదరి తనదైన నటనతో ఆకట్టుకుంది. బాహుబలి ప్రభాకర్ జి.కె.పాత్రలో విలన్ గా. హీరో స్నేహితునిగా కమెడీయన్ సుదర్శన్  తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఆర్.జి.సారథి అందించిన సంగీతం సీన్స్ ను ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.  కోలా భాస్కర్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు