Nenjuku Needhi Review: అణగారిన స్త్రీల ఆర్తనాదం

3 Jul, 2022 10:36 IST|Sakshi

‘ముప్పై రూపాయలు మనకు ఎంత ముఖ్యం’ అని ఆలోచిస్తాడు హీరో  ‘నెంజుక్కు నీది’ సినిమాలో. ముప్పైరూపాయలతో ఇవాళ సరైన టిఫిన్‌ కూడా రాదు. అసలు ముప్పై రూపాయలను లెక్క కూడాచేయం. కాని కూలీలో ముప్పై రూపాయలు పెంచమని ముగ్గురు అమ్మాయిలు అడిగితే ఏమవుతుంది? అదీ దళిత అమ్మాయిలు అయితే? వాళ్లను ‘అణిచేయ బుద్ధవుతుంది’. అందుకు ‘అత్యాచారం చేయొచ్చులే’  అనిపిస్తుంది. కాని చట్టం ఉంది. దానిని సరైనవాడు ఉపయోగిస్తే ఇలాంటి ఆలోచనకు కూడా భయం వస్తుందని చెప్తున్న సినిమా ‘నెంజుక్కు నీది’. ‘పుట్టుకతో సమానం’ ట్యాగ్‌లైన్‌. సోని లివ్‌లో విడుదల.

సినిమా దాదాపు క్లయిమాక్స్‌కు వస్తుంది. హీరో ఉదయనిధి స్టాలిన్‌ సిబిఐ ఆఫీసర్‌తో అంటాడు– ‘ఇద్దరు అమ్మాయిలను రేప్‌ చేసి చంపేశారు. వారిని కాల్చేయొచ్చు. పూడ్చి పెట్టొచ్చు. కాని వాళ్ల వాడకే తీసుకెళ్లి చెట్టుకు ఉరి వేశారు. ఎందుకో తెలుసా? వారిని హెచ్చరించడం కోసం. మీరు ఇంతలోనే ఉండాలని హెచ్చరించడం కోసం’. ఈ దేశంలో ‘వాడ’ ఉంది. ఊరికి దూరంగా ఆ ‘వాడ’ ఉంటుంది. ఈ దేశంలో ‘కులం’ ఉంది. అది ఎవరు ఎక్కువో ఎవరో తక్కువో, ఎవరితో కలవాలో ఎవరితో కలవకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో, ఎవరిని ఈసడించాలో ఎవరిని గౌరవించాలో, ఎవరితో అహంకారంగా వ్యవహరించాలో ఎవరితో అణిగిమణిగి ఉండాలో చెబుతుంది. సంఘనీతి, సంస్కృతి, కట్టుబాట్లు తరతరాలుగా అలా చెప్పేలా చేశాయి. అందుకే ఒక వ్యక్తి కులాన్ని బట్టి అతడితో ‘ఎలా వ్యవహరించాలో’ ఈ దేశ జనులకు ఒక అవగాహన ఉంది. అనుమతి కూడా ఉంది.

‘నెంజుక్కు నీది’ (తెలుగు డబ్బింగ్‌ ఉంది)లో పెద్ద కులం వాళ్ల కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పని చేసే ముగ్గురు ఆడపిల్లలు తమ రోజు కూలి రేటు పెంచమంటారు. ముప్పై రూపాయలు. ఆ ఫ్యాక్టరీ బాగా బలిసిన వ్యక్తిది. పైగా మంత్రి మేనల్లుడిది. అతనికి 30 రూపాయలు పెంచమని అడగడం– అసలు ఏదైనా డిమాండ్‌ పెట్టడం నచ్చదు. పైగా కడజాతి వాళ్లు వచ్చి అలా అడగడం నచ్చదు. అతనికి స్కూల్‌ బస్‌ ఉంటుంది. దాంట్లో ఆ ముగ్గురు అమ్మాయిలు ఇంటికి వెళుతుంటే కిడ్నాప్‌ చేస్తాడు. ఆ తర్వాత స్కూల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేస్తాడు. ఇద్దర్ని చంపేస్తాడు. మరో అమ్మాయి తప్పించుకుంటుంది. ఈ కేసును ఛేదించే బాధ్యత ఏ.ఎస్‌.పి. ఉదయనిధిపై పడుతుంది.
అయితే ఈ దేశంలో ‘నేరము–శిక్ష’ నేరుగా ఉండదు అని విచారణ చేసే కొద్దీ ఉదయనిధికి అర్థం అవుతుంది.

‘ఎవరు’ నేరం చేశారు, ‘ఎవరు’ బాధితులు, ఏ (కులం) పార్టీ అధికారంలో ఉంది, ఏ (కులం) అధికారి విచారణ చేస్తున్నాడు, ఏ ‘కులం’ వాళ్లు దీనికి ఎలా రియాక్ట్‌ అవుతారు, డిఫెన్స్‌ లాయర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఏ వర్గాల వారు ఇవన్నీ ఒక ‘శిక్ష’ను ప్రభావితం చేయగలవని అతడు తెలుసుకుంటాడు. మన దేశంలో కొందరికి వెంటనే శిక్షలు పడటం, కొన్ని కేసులు ఎప్పటికీ తేలకపోవడం ఇందుకే అని తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా చనిపోయింది దళిత అమ్మాయిలు కాబట్టి చట్టంలో ఉండే కొందరు అధికారులు ‘ఇది మామూలే’ అనుకుంటారు. కేసు క్లోజ్‌ చేయాలని చూస్తారు. కేసును సాల్వ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న ఉదయనిధిపై ఒత్తిడి తెస్తారు. చివరకు సస్పెండే చేస్తారు. కాని ఉదయనిధి తగ్గడు. రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 15’ని గుర్తు చేస్తాడు. ‘జన్మ వల్లగాని, పుట్టిన ప్రాంతం వల్ల గాని, కులం వల్ల గాని, మతం వల్ల గాని వివక్ష చూపరాదు’ అని చెప్పేదే ఆర్టికల్‌ 15. రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన అధికారిగా ముందుకు సాగి కేసును ఛేదిస్తాడు.

హిందీలో వచ్చిన ‘ఆర్టికల్‌ 15’కు రీమేక్‌గా తీసిన ఈ సినిమా మొదలైన వెంటనే ప్రేక్షకులను కూడా నిందితులను చేయడంలోనే విశేషం అంతా ఉంది. ప్రేక్షకులకు కూడా ఒక కులం, మతం, భావధార ఉంటాయి కనుక వారు ఆ పాత్రల్లో తాము ఎక్కడ ఉన్నారో తరచి చూసుకుంటారు. జరిగిన నేరంపై తమ వైఖరి ఏమిటో గమనించుకుంటారు. ‘ప్రతి కులంలో బాధ ఉంది’ అని ఒక మంచి అధికారి ఇందులో దళితుడితో అంటాడు. అందుకు జవాబుగా ఆ దళితుడు ‘నిజమే. ప్రతి కులంలో బాధ ఉంది. కాని కులం వల్ల మాత్రమే కలిగే బాధ మాకు ఉంది’ అని జవాబు చెప్తాడు. ఇక ఆ కులంలో పుట్టే స్త్రీల బాధ ఎలాంటిదో ఈ సినిమా చెబుతుంది. ‘విద్యలో, ఉద్యోగాలలో చూపే అంటరానితనం అత్యాచార సమయంలో మాత్రం ఉండదు’ అనే డైలాగ్‌ కూడా ఉంది.

హిందీలో అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంలో సినీ కవి అరుణ్‌ రాజా కామరాజ్‌ తీశాడు. తమిళానికి తగినట్టుగా మంచి మార్పులు చేసుకున్నాడు. కథనం ఆసక్తికరంగా మలిచాడు. సినిమా ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. వ్యవస్థ మారలేదని కాదు. చాలా మారింది. కాని అది సరిపోదని, సరి చేసుకోవాల్సిందేనని చెప్పే సినిమా ‘నెంజుక్కు నీది’. 

మరిన్ని వార్తలు