Nenu C/o Nuvvu Movie Review: ‘నేను c/o నువ్వు’మూవీ రివ్యూ

30 Sep, 2022 20:49 IST|Sakshi

టైటిల్‌: నేను c/o నువ్వు
నటీనటులు:రత్న కిషోర్,సన్య సిన్హా,సత్య,ధన, గౌతమ్ రాజ్ ,సాగారెడ్డి, తదితరులు
నిర్మాణ సంస్థ: అగపే అకాడమీ
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- దర్శక, నిర్మాత : సాగా రెడ్డి తుమ్మ
సంగీతం: ఎన్‌.ఆర్‌.రఘునందన్‌
సినిమాటోగ్రఫీ:జి.కృష్ణ ప్రసాద్
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
విడుదల తేది: సెప్టెంబర్‌ 30, 2022

రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను c/o నువ్వు’.ఈ చిత్రానికి అత్తావలి , శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు  సహ నిర్మాతలు.ఈ చిత్రం  విడుదలైన మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
 ఈ సినిమా కథంతా 1980లో జరుగుతుంది. గోపాలపురం గ్రామానికి చెందిన మారుతి(రత్న కిషోర్‌) ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. ఆ ఊరిలో కులాల మధ్య విఫరీతమైన వర్గపోరు నడుస్తుంటుంది. అలాంటి సమయంలో మారుతి ఆ ఊరి ప్రెసిడెంట్‌ ప్రతాప్‌రెడ్డి చెల్లెలు దీపిక(సన్య సిన్హా)తో తొలి చూపుతోనే ప్రేమలో పడిపోతాడు. దీపిక మొదట్లో మారుతిని పట్టించుకోకపోయినా..తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రతాప్‌రెడ్డి..తన కులం అబ్బాయి కార్తీక్‌తో చెల్లెలు పెళ్లి ఫిక్స్‌ చేస్తాడు. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఆ ఊరిని ఎటువైపు తీసుకెళ్లాయి? కార్తీక్  తో దీపికకు పెళ్లి జరిగిందా ? లేక  ప్రతాప్ రెడ్డి ని ఎదిరించి దీపిక, మారుతిలు పెళ్లి కున్నారా? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
పరువు హత్యల నేపథ్యలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. నేను c/o నువ్వు చిత్రం కూడా ఆ కోవలోకి చెందిందే. రొటీన్‌ కథే అయినా విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సాగారెడ్డి తుమ్మ. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరువు హత్యల నేపథ్యం ఉన్న కాన్సెప్ట్‌ని ఎంచుకొని, తెరపై చక్కగా చూపించాడు. అయితే పెద్ద ఆర్టిస్టులు లేకపోవడం కొంత డ్రా బ్యాక్ అని చెప్పవచ్చు.ఇందులో హీరో ఉన్నంతలో బాగా చేశాడు. కానీ ఆ పాత్రకు ఎవరైనా ఎలివెటెడ్ ఆర్టిస్ట్ ఉండి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే..
రత్న కిషోర్ కొత్తవాడైనా తన పరిధిలో చాలా చక్కగా నటించాడు . సన్య సిన్హా తన నటనతో ఆకట్టుకుంది. గౌతమ్ రాజ్, ధనరాజ్ లు కీలక పాత్రలలో నటించారు.మారుతి కి ఫ్రెండ్స్ గా నటించిన సత్య, రాధాకృష్ణ , బాషా తదితరులు అందరూ తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. దర్శకుడిగా, నటుడుగా సాగారెడ్డి తుమ్మ ప్రతాప్ రెడ్డి పాత్రలో చక్కటి విలనిజం చూపించాడు.చెల్లెలు దీపికను ప్రేమగా చూసుకొనే అన్నయ్యగా అద్భుతంగా నటించాడు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్. ఒక్క క్షణం.. లోన చేరే.. ఒక్క సారి జీవితమూ.. పాట, హే బేబీ  మై బేబీ పాటలు ఆకట్టుకుంటాయి. కృష్ణ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు