Nenu Meeku Baaga Kavalsinavaadini Review: ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మూవీ రివ్యూ

16 Sep, 2022 14:01 IST|Sakshi
Rating:  

టైటిల్‌: నేను మీకు బాగా కావాల్సిన వాడిని
నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సోనూ ఠాకూర్‌, సిధ్ధార్ద్‌ మీనన్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌, సమీర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: కోడి దివ్య దీప్తి
దర్శకత్వం : శ్రీధర్‌ గాదె
మాటలు, స్క్రీన్‌ప్లే: కిరణ్‌ అబ్బవరం
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫి: రాజ్‌ నల్లి
విడుదల తేది: సెప్టెంబర్‌ 16, 2022

రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కిరణ్‌ అబ్బవరం.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.  ఈ మధ్యే సమ్మతమే అంటూ ప్రేక్షకులన పలకరించిన కిరణ్‌.. తాజాగా ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచాల మధ్య ఈ శుక్రవారం (సెప్టెంబర్‌16) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
వివేక్‌(కిరణ్‌ అబ్బవరం) ఓ క్యాబ్‌ డ్రైవర్‌.అతనికి ఓ సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి తేజు(సంజనా ఆనంద్‌) పరిచయం అవుతుంది. ఆమె ప్రతి రోజు రాత్రి మద్యం సేవించి.. వివేక్‌ క్యాబ్‌ని బుక్‌ చేసుకొని ఇంటికి వెళ్తుంది. అయితే ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న తేజూను  ఓ రౌడీ ముఠా ఎత్తుకెళ్తే.. వారి నుంచి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమె ఎందుకిలా రోజూ అతిగా మద్యం సేవిస్తుందో అడిగి తెలుసుకుంటాడు. తనను సిద్దు(సిధ్ధార్ద్‌ మీనన్) ప్రేమించి మోసం చేశాడని, తన అక్క చేసిన తప్పుకు తనకు శిక్ష పడిందని బాధ పడుతుంది. వివేక్‌ తన మాటలతో సంజుని ప్రోత్సహించి ఇంటికి పంపిస్తాడు.

ఏడాది తర్వాత ఇంటికి వచ్చిన తేజుని కుటుంబ సభ్యులు ఒక్క మాట అనకుండా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. తానను ఫ్యామిలికి దగ్గరకు చేసిన వివేక్‌పై ఇష్టం పెంచుకుంటుంది తేజు. ఓ రోజు తన ప్రేమ విషయాన్ని అతనితో చెప్పాలనుకుంటుంది. అయితే అదే సమయంలో తేజుకు షాకిస్తాడు వివేక్‌. తన పేరు వివేక్‌ కాదని పవన్‌ అని చెబుతాడు. మలేషియాలో ఉండే పవన్‌ క్యాబ్‌ డ్రైవర్‌ వివేక్‌గా ఎందుకు మారాడు?  తేజును ప్రేమించి మోసం చేసిందెవరు? ఆమె అక్క చేసిన తప్పేంటి? చివరకు తేజు, వివేక్‌లు  ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ కథ కొత్తదేమి కాదు. పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో కొంతవరకు మాత్రమే దర్శకుడు సఫలం అయ్యాడు. ట్విస్టులు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కుటుంబానికి దూరమైన బాధలో మద్యానికి అలవాటైన హీరోయిన్‌ని హీరో తన మాటలతో మార్చి, ఆమెను కుటంబానికి దగ్గరయ్యేలా చేయడమే ఈ సినిమా కథ. అయితే ఇందులో వచ్చే ట్విస్టుల మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. ఫస్టాఫ్‌ అంతా కిరణ్‌ అబ్బవరం గెస్ట్‌ రోల్‌గానే కనిపిస్తాడు.

ఫ్యామిలీతో తేజుకు ఉన్న అనుబంధం, ఆమె లవ్‌స్టోరి, అందులో వచ్చే ట్విస్ట్‌లతో ఫస్టాప్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో లాయర్‌ పాపతో వివేక్‌ లవ్‌స్టోరీ ఫన్నీగా సాగుతుంది. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ నవ్వులు పూయిస్తుంది. అయితే కొన్ని డైలాగ్స్‌ మాత్రం సహజంగా కాకుండా తెచ్చిపెట్టినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. లాజిక్కులు వెతక్కుండా చూస్తే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాస్త అలరిస్తుంది. 


ఎవరెలా చేశారంటే..
క్యాబ్‌ డ్రైవర్‌ వివేక్‌ పాత్రకి కిరణ్‌ అబ్బవరం న్యాయం చేశాడు. గత చిత్రాలలో పోలిస్తే నటన పరంగా  ఓ మెట్టు  ఎక్కాడనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంజనా ఆనంద్‌ పాత్ర చాలా కీలకం. తేజుగా ఆమె తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లాయర్‌ దుర్గగా సోనూ ఠాకూర్‌ మెప్పించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తెరపై అందంగా కనిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజు తండ్రిగా నటించిన ఎస్వీ కృష్ణారెడ్డి తన పాత్రకు న్యాయం చేశాడు.  సెకండాఫ్‌లో బాబా భాస్కర్‌ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మణిశర్మ సంగీతం బాగుంది.  పాటలు ఈ సినిమాకు చాలా ప్లస్‌. నేపథ్య సంగీతం పర్వాలేదు. రాజ్‌ నల్లి సినిమాటోగ్రఫి బాగుంది. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

Rating:  
(2.25/5)
మరిన్ని వార్తలు