ఆ ఒత్తిడి మా మీదా ఉంది

15 Oct, 2020 00:51 IST|Sakshi

సీనియర్‌ నటి సుహాసినిలో దర్శకురాలు కూడా ఉన్నారు. గతంలో ‘ఇందిర’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారామె. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు సుహాసిని. అమేజాన్‌ ప్రైమ్‌ నిర్మించిన ‘పుత్తమ్‌ పుదు కాలై’ అనే యాంథాలజీలో ఓ భాగానికి దర్శకత్వం వహించారామె. ‘కాఫీ, ఎనీవన్‌?’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ భాగంలో అనూహాసన్, శ్రుతీహాసన్‌ నటించారు. ఈ నెల 16న ఈ యాంథాలజీ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ– ‘‘కాఫీ, ఎనీవన్‌’ కథలో మా కజిన్‌ అనూహాసన్, శ్రుతీహాసన్‌ నటించారు. మా నాన్న చారుహాసన్, బాబాయి కమల్‌హాసన్‌ని కూడా యాక్ట్‌ చేయించాలనుకున్నాను. తర్వాత వద్దనుకున్నాను. ఈ లాక్‌డౌన్‌ సమయంలో సుమారు ఆరు షార్ట్‌ స్టోరీలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. కుటుంబ సభ్యులకే అవకాశాలు, నెపోటిజమ్‌ అనే టాపిక్‌ గురించి మాట్లాడుతూ – ‘‘నేను చారుహాసన్, కమల్‌హాసన్‌ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనేది ఎవ్వరం మార్చలేం. ఆ నెపోటిజమ్‌ ఒత్తిడి మా మీదా ఉంది. మా తర్వాతి తరం అయిన శ్రుతీహాసన్‌ వంటి వాళ్ల మీద ఇంకా ఉంది. అయితే సౌతిండియాలో నెపోటిజమ్‌ అనే మహమ్మారి  ఇంకా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుహాసిని.

మరిన్ని వార్తలు