ఆర్‌ఆర్‌ఆర్: అన్నీ సవ్యంగా సాగి ఉంటేనా!

30 Jul, 2020 14:49 IST|Sakshi

సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆది నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ మొదలు.. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా..‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో విడుదల చేసిన సర్‌ప్రైజ్‌ వీడియో వరకు ప్రతీ విషయంలో జక్కన్న టీం అభిమానులను ఆకట్టుకుంటూనే వచ్చింది. అయితే సినిమా విడుదల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ నిరాశకు గురిచేస్తూనే ఉంది. నిజానికి చిత్ర బృందం ముందుగా ప్రకటించినట్లు జూలై 30న అంటే ఈరోజు సినిమా రిలీజ్‌ కావాల్సింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు‌.. ‘‘జూలై 30, 2020’’ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు. (యానిమేషన్‌... సూపర్‌విజన్‌)

‘‘అన్నీ సవ్యంగా జరిగి ఉంటేనా.. థియేటర్ల ముందు ఒక రేంజ్‌లో సెలబ్రేషన్స్‌ ఉండేవి. కానీ ఏం చేద్దాం’’ అంటూ కొంతమంది ఫ్యాన్స్‌ వాపోతుండగా.. మరికొందరు థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూస్తున్నట్లుగా ఉన్న మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఇంకొంత మంది ఏకంగా.. ‘‘ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫైట్లు ఇరగదీశారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయింది. క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంది’’ అంటూ రివ్యూలు చెప్పేస్తూ పాత వీడియోలను షేర్‌ చేస్తున్నారు. కాగా బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం పరితపించే రాజమౌళి.. సినిమా విడుదలలో ఎంత జాప్యమైనా పట్టించుకోరనే విషయం గతంలో ఎన్నోసార్లు స్పష్టమైన సంగతి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలోనూ ఆయన అదే పంథాను అనుసరించారు. (ఆర్‌ఆర్‌ఆర్‌ ఓ అద్భుతం)

ఈ నేపథ్యంలో..‘‘ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించాలని మా టీమ్‌ అంతా కష్టపడుతోంది. వాయిదా పడటం నిరుత్సాహం కలిగించే వార్తే. అయితే మా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం’’అంటూ జనవరి 8, 2021 మూవీని విడుదల చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా దెబ్బకు షూటింగ్‌లు వాయిదాపడటం సహా, జక్కన్న, కుటుంబానికి మహమ్మారి సోకిన నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ మరోసారి పోస్ట్‌పోన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని సగటు సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్నప్పటికీ గ్రాఫిక్‌ వర్క్‌ అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.‌ ఏదేమైనా ముందు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు