Akshay Kumar: అక్షయ్ కుమార్‌పై ఆగ్రహం .. అలా చేయడానికి సిగ్గుగా లేదు..!

6 Feb, 2023 16:43 IST|Sakshi

బాలీవుడ్ అక్షయ్‌కుమార్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచం చూపే గ్లోబ్‌పై నడుస్తూ ఇండియా మ్యాప్‌పై ఆయన షూస్ ధరించి నడవడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అక్షయ్ కుమార్ తన ట్వటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు బాలీవుడ్‌ హీరో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అక్షయ్ తన ఉత్తర అమెరికా టూర్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఆయన చేసిన పనితో ఇండియాను అగౌరవపరిచారని మండిపడుతున్నారు.

ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు దిశా పటానీ, నోరా ఫతేహి, మౌని రాయ్, సోనమ్ బజ్వా కూడా ఉన్నారు. ప్రమోషనల్ పోస్ట్‌లో వారు గ్లోబ్‌పై నడుస్తూ కనిపించారు. అక్షయ్ కుమార్ ఈ వీడియో క్లిప్‌ షేర్ చేస్తూ.. "ఉత్తర అమెరికాకు 100%  దేశీ వినోదాన్ని తీసుకురావడానికి ఎంటర్‌టైనర్స్ సిద్ధంగా ఉన్నారు. మీ సీట్ బెల్ట్‌లు పెట్టుకోండి. మేము మార్చిలో వస్తున్నాము.' అంటూ రాసుకొచ్చారు.

ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఓ ట్విటర్ యూజర్.. ఓ కెనడియన్ నటుడు భారత మ్యాప్‌పై తిరుగుతూ భారతీయులను అవమానిస్తున్నారు. ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం?  ఈ సిగ్గుమాలిన చర్యకు మీరు 150 కోట్ల భారతీయులకు క్షమాపణలు చెప్పాలి.' అని రాశారు. మరొక నెటిజన్ రాస్తూ..  భాయి మన భారత్‌ను కాస్తైనా గౌరవించండి.' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చాలా మంది అతన్ని 'కెనడియన్ కుమార్' అని ఎగతాళి చేశారు. అక్షయ్ కుమార్ పౌరసత్వంపై పలు ప్రశ్నలు సంధించారు నెటిజన్స్. అతను కెనడియన్ పాస్‌పోర్ట్ కలిగి ఉండటం వల్ల నెటిజన్ల్ ట్రోల్స్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు