వేసవి రేసుకు రెడీ అంటున్న స్టార్స్‌ వీళ్లే..

3 May, 2021 00:17 IST|Sakshi

2020, 2021... ఈ రెండేళ్లు వేసవిలో సినిమా సంబరం లేకుండాపోయింది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ కారణంగా గతేడాది, సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ ఏడాది వేసవికి సినిమాలు థియేటర్లకు రాలేదు. కానీ వచ్చే ఏడాది వేసవిలో వసూళ్ల సందడి ఉంటుందని చెప్పొచ్చు. స్టార్‌ హీరోల సినిమాల విడుదల ప్రకటనలు సమ్మర్‌ను టార్గెట్‌ చేస్తుండడమే ఇందుకు ఓ నిదర్శనం. ఇప్పటివరకూ ప్రకటించిన ప్రకారం వచ్చే వేసవి రేసుకి రెడీ అయిన స్టార్స్‌ ఎవరంటే...

‘బాహుబలి’ అద్భుత విజయం ప్రభాస్‌ను ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ని చేస్తే, ‘కేజీఎఫ్‌’ సూపర్‌ హిట్టయి, అగ్ర హీరోలతో సినిమాలు చేసే దర్శకుల జాబితాలో ప్రశాంత్‌ నీల్‌ పేరును చేర్చింది. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘సలార్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇక 11 ఏళ్ల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కలిసి చేయనున్న సినిమా ప్రకటన ఇటీవల అధికారికంగా వచ్చింది. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇంతకుముందు మహేశ్, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు.

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో సినిమా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేస్తామని కొరటాల ఇప్పటికే వెల్లడించారు. వీరితో పాటు ఇతర స్టార్స్‌ కూడా సమ్మర్‌ రేసులో నిలవడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. మరి... ఈ కరోనా మహమ్మారి ఇంకెన్నాళ్లు ఉంటుంది? అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు