విడుదల తేదిలలో కన్‌ఫ్యూజన్‌.. నాలుగు సినిమాలు వాయిదా

21 Nov, 2021 08:20 IST|Sakshi

విడుదల తేదీల విషయంలో తెలుగు పరిశ్రమలోనే కాదు.. ఇతర భాషల్లోనూ కాస్త కన్‌ఫ్యూజన్‌ ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా నాలుగు హిందీ చిత్రాల విడుదల వాయిదా పడటం హాట్‌ టాపిక్‌ అయింది. శనివారం ఈ నాలుగు చిత్రాల కొత్త విడుదల తేదీని ఆయా చిత్రబృందాలు అధికారికంగా ప్రకటించాయి. ఆ విశేషాల్లోకి వెళితే... వచ్చే ఏడాది ఫిబ్రవరి విడుదలకు సిద్ధమైన  ‘లాల్‌సింగ్‌ చద్దా’ రిలీజ్‌ ఏప్రిల్‌ 14కి వాయిదా పడింది. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ది ఫారెస్ట్‌గంప్‌’కు హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు.

వాయిదా లిస్ట్‌లో ఉన్న మరో సినిమా షాహిద్‌ కపూర్‌ నటించిన ‘జెర్సీ’ (తెలుగు ‘జెర్సీ’కి రీమేక్‌). అలాగే వరుణ్‌ ధావన్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘జగ్‌ జగ్‌ జీయో’, రాజ్‌కుమార్‌ రావ్‌ ‘హిట్‌’ (తెలుగు ‘హిట్‌’కి రీమేక్‌) చిత్రాల కొత్త విడుదల తేదీలు కూడా శనివారం ఖరారయ్యాయి. ‘జెర్సీ’ డిసెంబరు 31న, ‘జగ్‌ జగ్‌ జీయో’ వచ్చే ఏడాది జూన్‌ 24న,  హిందీ ‘హిట్‌’ 2022 మే 20న విడుదల కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ చిత్రాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు బీ టౌన్‌ టాక్‌.

మరిన్ని వార్తలు