తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య దూరమే ప్రధానాంశంగా 'ఓ తండ్రి తీర్పు'

1 Nov, 2022 21:31 IST|Sakshi

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య పెరుగుతున్న దూరమే ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా 'ఓ తండ్రి తీర్పు'. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్‌పై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సమర్పకులు లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ జ‌న్మదినం సందర్భంగా ఇవాళ అట్టహాసంగా హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. 

ఆరిగపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. 'తల్లిదండ్రులు - పిల్లల మధ్య బంధాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తెలియజేప్పే సందేశాత్మ‌క క‌థ‌న‌మే 'ఓ తండ్రి తీర్పు'. మంచి సందేశంతో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తికి, చిత్రయూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు' అని అన్నారు. 

నిర్మాత లయన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. 'సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ తండ్రి తీర్పు నిర్మిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ ప్రోత్సాహం, ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభించడం ఆనందంగా ఉందని' అన్నారు. 

దర్శకుడు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ.. 'ఓ తండ్రి తీర్పు సినిమా క‌థ‌ రాయడానికే 6 నెలలు పట్టింది. ఈ కథను పుస్తకం రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఎవరు సహకరించలేదు. ఓ తండ్రి తీర్పు పుస్తకంగా, సినిమాగా రూపొందటానికి లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సహకారం, రమణ చారి గారి ప్రోత్సహం ఎంతగానో ఉంది' అని అన్నారు.
 

మరిన్ని వార్తలు