Nidhhi Agerwal: ఘాటు విమర్శలు పట్టించుకోను

12 Jan, 2022 07:52 IST|Sakshi

‘‘నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. అందుకే తెలుగువారికి బాగా కనెక్ట్‌ అయ్యాను. హిందీ, తమిళ సినిమాలు చేసినా తెలుగు పరిశ్రమ అంటేనే నాకు చాలా ఇష్టం.. ఇక్కడ పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది’’ అని హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌ అన్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశోక్‌ గల్లా, నిధి అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘హీరో’. కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ చిత్రం  ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్‌ పంచుకున్న విశేషాలు...

శ్రీరామ్‌ ఆదిత్యగారు ‘హీరో’ కథ చెప్పగానే ఆఫ్‌బీట్‌ సినిమాగా అనిపించింది. కథ విన్నప్పుడు నా పాత్రకి ఎంత న్యాయం చేయగలనని ఆలోచిస్తాను. నటుడిగా అశోక్‌ కొత్త అనే ఫీల్‌ కలగలేదు. అనుభవం ఉన్నవాడిలా చేశాడు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో డాక్టర్‌గా చేశాను. ఇప్పుడు ‘హీరో’ సినిమాలోనూ సుబ్బు అనే డాక్టర్‌ పాత్రే చేశాను. కానీ రెండింటికీ తేడా ఉంటుంది. రెండు కుటుంబాల మధ్య జరిగే డ్రామా ‘హీరో’. వినోదంతో పాటు కథలో కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. పాటలు కూడా బాగా వచ్చాయి. ఇది సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ. 

నేనెప్పుడూ వైవిధ్యమైన పాత్రలు చేయాలనే చూస్తాను. సినిమా సినిమాకు చాలా నేర్చుకుంటున్నా. షూటింగ్‌ లేనప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్, ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ కూడా చూస్తుంటాను. నటి కాకముందు నుంచే నాకు సోషల్‌ మీడియాలో వన్‌ మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. కెరీర్‌ పరంగా సోషల్‌ మీడియా నాకు చాలా ఉపయోగపడింది. కొందరి విమర్శలు కూడా ఘాటుగానే ఉన్నా పట్టించుకోను. ఫిట్‌నెస్‌ కోసం రోజుకు 45 నిమిషాలు కేటాయిస్తా. నేను శాఖాహారిని. నా డైట్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది.

నిర్మాత పద్మ గల్లాగారితో పనిచేయడం ఆనందంగా ఉంది. నాకిష్టమైన కెమెరామేన్‌ సమీర్‌ రెడ్డిగారితో పనిచేయడం హ్యాపీ. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత గ్లామర్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌లైన్‌ రావడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. నాకు యాక్షన్‌ పాత్రలంటే ఇష్టం. ‘హరిహర వీరమల్లు’లో యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. అల్లు అర్జున్, రామ్‌ చరణ్, ఎన్‌టీఆర్‌లతో నటించాలనుంది. ఓటీటీ కంటే సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇస్తా. ప్రస్తుతం తెలుగులో కొన్ని కొత్త ప్రాజెక్టులకు చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా చేశాను.. మరో సినిమా లైన్‌లో ఉంది. ఏప్రిల్‌లో హిందీ సినిమా ప్రారంభం కాబోతోంది.

మరిన్ని వార్తలు