అందుకే వాన పాటల గురించి ఆలోచించడం లేదు: నిధీ అగర్వాల్‌

25 Jul, 2021 01:34 IST|Sakshi

చిరుజల్లులను చూడటం నిధీకి ఎంతో ఇష్టం. వానలో తడవడం చాలా చాలా ఇష్టం. వాన పాటలంటే ఇష్టం. మరి.. వాన పాట చేయడం నిధీకి ఇష్టమేనా? ఆ విషయంతో పాటు ‘వర్షం సాక్షి’గా నిధీ అగర్వాల్‌ చెప్పిన ‘వానాకాలమ్‌’ కబుర్లు తెలుసుకుందాం.

► చిన్నప్పటి వానాకాలపు జ్ఞాపకాలు...
నిధీ అగర్వాల్‌: చిన్నప్పుడు వర్షం అంటే.. వేడి వేడి టీ తాగుతూ, పకోడీలు తినేదాన్ని.

► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ అమ్మగారు తిట్టేవారా?
వర్షంలో తడవడం ఏ పిల్లలకు ఇష్టం ఉండదు చెప్పండి. మా అమ్మగారు తడవడానికి అనుమతించేవారు కాదు కానీ, మనం ఆగం కదా (నవ్వుతూ). నేను మాత్రం వర్షంలో బాగా ఆడుకునేదాన్ని. ఇక రెయినీ సీజన్‌లో స్కూల్‌కి వెళ్లడం అంటే పండగే. ఫుల్లుగా తడిచేదాన్ని.

► కాగితపు పడవలు చేసేవారా?
ఈ మధ్య చేయలేదు. 10, 11 ఏళ్లప్పుడు చేశాను. బోట్‌ చేయడం.. నీళ్లల్లో వదలడం.. భలే సరదాగా అనిపించేది.

► చివరిసారిగా ఫుల్లుగా తడిసిందెప్పుడు?
ఈ మధ్యే. ఒక షూటింగ్‌లో ఉన్నప్పుడు ఒకేసారి భారీగా వర్షం వచ్చింది. షూటింగ్‌ లొకేషన్‌ దగ్గర్లోనే ఉన్న నా వ్యాన్‌లోకి వెళ్లేలోపే తడిసిపోయాను.

► ఈ సీజన్‌లో ఎలాంటి రంగు దుస్తులు వేసుకుంటారు?
వర్షాకాలంలో తెలుపు రంగు దుస్తులకు నో. అది కాకుండా ఏదైనా ఓకే.

► నచ్చిన వాన పాట?
వాన బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ ఏదైనా ఇష్టమే. బాగా నచ్చే పాట అంటే... ఐశ్వర్యా రాయ్‌ ‘బరసో రే మేఘా.. మేఘా...’ (‘గురు’ సినిమా). నాకు ఐశ్వర్యా రాయ్‌ అంటే చాలా చాలా ఇష్టం. ఈ పాటే కాదు.. నటిగా ఆమె ఏం చేసినా ఇష్టమే.

► వాన పాటల్లో నటించడం ఇష్టమేనా?
వాన పాటలు చేయడం అంత ఈజీ కాదు. నటిస్తున్నప్పుడు తడవడం, షాట్‌ గ్యాప్‌లో ఆరడం, మళ్లీ తడవడం.. బాబోయ్‌... ముఖ్యంగా వాన పడుతుంటే కళ్లు తెరిచి ఉంచి, నటించడం అంటే కష్టమే. అందుకే వాన పాటల గురించి ఆలోచించడంలేదు.

► వానలో ఇరుక్కున్న ఘటన ఏదైనా?
ముంబయ్‌లో ఉన్నప్పుడు జరిగింది. జోరు వాన కారణంగా ఫ్లయిట్‌ టైమింగ్స్‌ మారడంతో నేను ఒకే ఫ్లయిట్‌లో కాకుండా కనెక్టింగ్‌ ఫ్లయిట్స్‌లో జర్నీ చేయాల్సి వచ్చింది. అలా ఫ్లయిట్లు మారడం ఇబ్బందిగా అనిపించింది. ఈ మధ్య వర్షం కారణంగా ఓ సినిమా షూటింగ్‌ క్యాన్సిల్‌ అయింది. అలా జరగడంవల్ల ఇంకో రోజు జర్నీ చేసి, మళ్లీ ఆ షూట్‌లో పాల్గొనాల్సి వచ్చింది.

► వానాకాలంలో తీసుకునే జాగ్రత్తలు?
జలుబు చేయకూడదని ఈ సీజన్‌లో ఎక్కువగా వేడి నీళ్లు తాగుతుంటాను.

►వర్షాలప్పుడు షూటింగ్‌లో పాల్గొనడం ఇష్టమేనా?
సంవత్సరం మొత్తంలో వాన రోజు తప్ప ఏరోజైనా షూటింగ్‌లో పాల్గొనడం ఇష్టమే. రెయినీ డే మాత్రం ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. చక్కగా రూమ్‌లో కూర్చుని, కిటికీలోంచి వాన జుల్లులు చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అప్పుడు వేడి వేడిగా ఏదైనా తింటూ, టీ తాగితే మాటల్లో ఎక్స్‌ప్రెస్‌ చేయలేనంత అనుభూతి కలుగుతుంది.

మరిన్ని వార్తలు