Hero Nikhil: స్లోగా వెళుతున్నాను అంతే... డౌన్‌ కాలేదు

12 Aug, 2022 03:52 IST|Sakshi

‘‘హిస్టరీ వర్సెస్‌ మైథాలజీగా ‘కార్తికేయ 2’ తీశాం. ఇందులో ప్రతి సీన్‌కు ఒక మీనింగ్‌ ఉంటుంది. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్‌ అంశాలున్నాయి. దేవుడు ఉన్నాడా? లేదా అనేవారికి మా సినిమా నచ్చుతుంది. దేవుడంటే ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు నిఖిల్‌. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్‌ అవుతోంది. ఈ  సందర్భంగా నిఖిల్‌ చెప్పిన  విశేషాలు.

► ‘కార్తికేయ’ కంటే ‘కార్తికేయ 2’కి చందూగారు కథ, మాటలు చాలా బాగా రాసుకున్నారు. ఈ సినిమాలో ఫుల్‌ టైమ్‌ డాక్టర్‌గా, పార్ట్‌ టైమ్‌ డిటెక్టివ్‌గా నటించాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి, సాహసం చేసే పాత్ర నాది. ఎక్కడా గ్రాఫిక్స్‌ పెట్టలేదు. ఈ సినిమా కొంత నార్త్‌లో జరుగుతుంది కాబట్టి అనుపమ్‌ ఖేర్‌గారిని తీసుకున్నాం.

► ‘కార్తికేయ 2’ని అన్ని భాషల్లో డబ్‌ చేశాం. వేరే భాషల్లో నా సినిమా విడుదలవడం ఇదే తొలిసారి. కాలభైరవ మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ఇందులోని మూడు పాటలు చాలా బాగుంటాయి. సాహస కథలైన టిన్‌ టిన్‌ బుక్స్‌ అంటే నాకు బాగా ఇష్టం.. బాగా చదివేవాణ్ణి. చందూకి కూడా చాలా ఇష్టం. హాలీవుడ్‌ ‘ఇండియానా జోన్స్‌’ చిత్రకథల్లా మనకు కూడా ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ తీసి, భారతీయ సినిమా గొప్పతనాన్ని చూపించాలనుకుంటున్నాం.

► ప్రస్తుతం విలన్‌ క్యారెక్టర్‌ అనేది మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ‘బ్యాట్‌ మేన్‌’ మూవీలో హీరో, విలన్‌.. ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి. మంచి క్యారెక్టర్స్‌ వస్తే తప్పకుండా విలన్‌గా చేస్తాను. నేను నటించిన ‘18 పేజెస్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్‌ వర్మతో ఒక సినిమా చేస్తున్నాను. ఈ ఏడాది చివర విడుదలయ్యే నా ‘స్పై’ చిత్రాన్ని మల్టీ లాంగ్వేజ్‌లలో తీస్తున్నాం. నా కెరీర్‌ స్లోగా పైకి వెళుతోంది తప్ప ఇప్పటివరకు డౌన్‌ కాలేదు..  ప్రస్తుతం అన్ని విధాలుగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు.   

మరిన్ని వార్తలు