నిశ్శబ్దం ఫ్రెష్‌ ఫీల్‌ ఇస్తుంది

28 Sep, 2020 00:52 IST|Sakshi
హేమంత్‌ మధుకర్‌

అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్‌ మ్యాడ్‌సన్, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా చిత్రదర్శకుడు హేమంత్‌ మధుకర్‌ మీడియాతో చెప్పిన విశేషాలు.

► కమల్‌హాసన్‌ నటించిన ‘పుష్పక విమానం’ సినిమాలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోగాత్మక సినిమాగా చేద్దామనుకుని కోన వెంకట్‌గారికి ఈ కథ చెప్పాను. కోనగారికి కథ నచ్చటంతో ఆయన ద్వారా అనుష్కగారికి, మిగతా నటీనటులకు ఈ కథ చెప్పి, ఒప్పించాను. ప్రయోగాత్మక చిత్రం అంటే నిర్మాతలు ముందుకు రారేమోనని కోన వెంకట్‌గారి సలహా మేరకు మూకీ సినిమాని కాస్తా డైలాగ్స్‌తో నింపి మెయిన్‌ పాత్ర అనుష్క క్యారెక్టర్‌ను మాత్రం మూకీగా ఉంచాను. అప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ నిర్మాణ భాగస్వామిగా చేరటంతో మా ‘నిశ్శబ్దం’ తెరకెక్కింది.


► విజువల్‌గా గ్రాండ్‌గా కనిపించటంతో పాటు ప్రేక్షకులకు ఫ్రెష్‌ ఫీల్‌ రావటం కోసం, కథానుగుణంగా సినిమాను అమెరికాలో చిత్రీకరించాం. అమెరికాలో పుట్టిన ఇండియన్‌ అమ్మాయి పాత్ర అనుష్కది. అలాగే అన్ని ముఖ్యపాత్రలు అమెరికా నేపథ్యంలో ఉంటాయి. ఒరిజినాలిటీ  మిస్‌ కాకూడదనే ఉద్దేశంతో హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ను పూర్తి నిడివి ఉన్న పాత్రకోసం తీసుకున్నాం. ఒక హాలీవుడ్‌ నటుడు పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ అని అనుకుంటున్నాను.

► ఈ సినిమాను కేవలం 55రోజుల్లో తీయగలిగానంటే దానికి కారణం పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలే. అమెరికాలో షూటింగ్‌ అంటే వీసాలు, లొకేషన్లు అని ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పిన కథను నమ్మి టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల గార్లు ఏ లోటు లేకుండా చేయటం వల్లే ఈ సినిమా సాధ్యమయింది. ఈ సినిమాలోని సౌండ్, షానిల్‌ డియో కెమెరా వర్క్‌ గురించి సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడతారని నమ్ముతున్నాను. సంగీత దర్శకుడు గిరీష్, గోపీసుందర్‌ నేపథ్య సంగీతం పోటాపోటీగా ఉంటాయి.

మరిన్ని వార్తలు